ఆధునిక యుగంలోనూ ఆస్ట్రాలజీకే యువతరం ఓటు
By అంజి Published on 4 Feb 2020 10:21 AM GMT“అయినా మనిషి మారలేదు” అని గుండమ్మ కథలో ఒక ఫేమస్ సాంగ్ ఉంది. ఆకాశంలోకి ఎగిరినా, ఆర్టిపిషియల్ ఇంటలిజెన్స్ ను సాధించినా, అంతరిక్షంలో ప్రయాణించినా, అంగారకుడిపై ఇల్లు కట్టినా మనిషి మారలేదు. నిజం.. ఆధునిక డ్రెస్సులు, యాపిల్ ఫోన్లు, వైఫై కనెక్షన్లు, హాట్ స్పాట్లు, ఆన్ లైన్ బుకింగులు, అమెజాన్ కొనుగోళ్లు ఎన్ని వచ్చినా .. మనిషి మారలేదు. అప్పుడెప్పుడో ఆదిమ యుగంలో ఆకాశంలో నక్షత్రాలను చూసి పన్నెండు రాశులను గుర్తించి, ఆ గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, వాటి గమనం తన బతుకులను నిర్దేశిస్తుందని నమ్మాడు. ఇప్పుడవన్నీ పేదరాసి పెద్దమ్మ కథలని తెలిసినా ఆస్ట్రాలజీ, చిలకజోస్యం, టారో, పామిస్ట్రీలపై మాత్రం నమ్మకం ఏమాత్రం తగ్గలేదు. అవును.. అయినా మనిషి మారలేదు..
తమాషా ఏమిటంటే అల్ట్రా ఆధునికులైన యువతీ యువకులు కూడా ఆస్ట్రాలజీని తెగ నమ్మేస్తున్నారట. సిలికాన్ వ్యాలీ నుంచి హైటెక్ సిటీ దాకా కుర్రకారు రాశుల విషయంలో నమ్మకాల రాసులు పోస్తున్నారట. ఎంటీవీ ఇటీవలే నిర్వహించిన ఒక సర్వేలో 75 శాతం మంది నవనాగరికులు జ్యోతిష్యం నిజమేనని నమ్ముతున్నారట. 65 శాతం మంది తప్పనిసరిగా దిన ఫలాలు, వారఫలాలు, కుదిరితే మాసఫలాలు చూసుకుంటున్నారట. రాహుకాలం, యమగండం చూసుకుని కానీ కాలు బయటపెట్టడం లేదు. 2017 - 19 మధ్యలో ఆన్‌లైన్‌లో హారోస్కోప్ యాప్‌ల సంఖ్య 62 శాతం పెరిగింది. వివిధ సైట్లలో దినఫలాలను బ్రౌజ్ చేయడం 150 వాతం పెరిగిందట. హిట్లు తెగ వచ్చేస్తున్నాయట. టంబ్లర్ నుంచి యూట్యూబ్ దాకా జ్యోతిష్య గురులు ఏ రంగు చొక్కా ధరించాలో, ఏ దిశగా ప్రయాణం చేయాలో చెప్పేస్తున్నారు. అదృష్ట రింగు, ఆకర్షణ గొలుసు, దుష్టశక్తులను దునుమానే కంకణం, పాపపు కన్నుల్ని పారద్రోలే తాబేలు బొమ్మ వంటి ఆస్ట్రాలజీ ఆధారిత ఉత్పాదనలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి రిస్కు లేని జీవితంకావాలంటే రాశుల మ్యాచింగ్, గ్రహాల అనుకూల్యతల వంటి అంశాల ఆధారంగానే కన్ను గీటుతున్నారట. ప్రేమను పంచుకుంటున్నారట.
టారో కార్డు రీడర్ నిధి చుగ్ కథనం ప్రకారం.. తన వద్ద టారో కార్డులు చూసుకునేవారిలో 90 శాతం మంది 23 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారే. ప్రేమ, డేటింగ్, పెళ్లి గురించే వాళ్లు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారట. ఎంటీవీ సర్వే ప్రకారం 25 శాతం పెళ్లి సంబంధాలు జాతకం కారణంగానే చెడిపోతున్నాయట. 34 శాతం మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ విషయంలో నిర్ణయాలను తీసుకునేముందు జోడయాక్ సైన్స్ చూస్తున్నారు. అంటే మీనం మేషం లెక్కిస్తే కానీ మిథునం దాకా రావడం లేదన్న మాట.