రాశి ఫలాలు జనవరి 12 నుంచి 18 వరకు

By Newsmeter.Network  Published on  12 Jan 2020 2:51 PM IST
రాశి ఫలాలు జనవరి 12 నుంచి 18 వరకు

మేష రాశి :

ఈ రాశివారికి లగ్నాధిపతి ఎనిమిదో ఆధిపత్యం కూడా ఉన్నా లాభిస్తాడు. గురుడు కూడా యోగ కారకుడు. చంద్రుడు సముడై యున్నాడు గనుక అతని ప్రయోజనం కూడా ఉంది. శని బుధ శుక్రులు మారకులై యున్నారు గనుక ఈ వారంలో వీరికి కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పొచ్చు.రవి యోగిస్తున్నాడు గనుక తండ్రి ఆరోగ్య విషయంలోను, చంద్రుడు సముడై ఉన్నాడు గనుక తల్లి ఆరోగ్య విషయంలో కూడా ఏరకమైన ఇబ్బంది లేదు. పిల్లలు కూడా చక్కని ఆరోగ్యం, చదువును పొందగలరు. కానీ చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఈ వారంలో స్పెక్యులేషన్ విషయంలో మీ ప్రయత్నాలు సాగకపోవచ్చు. ఎందుకైనా మంచిది మీరు పెద్దల లేదా గురువుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోండి. దాని వల్ల మీకు లాభం చేకూరుతుంది. అశ్విని వారికి మిత్ర తారతో వారం ప్రారంభం కనుక చాలా బావుంటుంది. భరణి వారికి మాత్రమే నైధనతారతో ప్రారంభం ఔతుంది కనుక కొంచెం ఇబ్బందులు కలుగుతాయి కృత్తిక ఒకటో పాదం వారికి సాధన తారైంది మంచి ఫలితాలొస్తాయి.

పరిహారం : మీరు ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయించినా బుధవారం నాడు పితృదేవతలకు దానాదులిచ్చినా మంచిది.

వృషభ రాశి :

ఈ రాశివారికి ఈ వారంలో చక్కనైన ప్రయోజనాలు కలగనున్నాయి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వీరు స్వ కార్యాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంది . అష్టమాధిపతి గురుడు దోష ప్రదుడే అయినా శని బుధ శుక్రుల సహకారంతో పనులన్నీ చక్క పరుచుకుంటారు. కోణ ఆధిపత్యం వచ్చిన శని మీకు ఏదో ఒక మేలు చేకూరుస్తాడు. అలాగే బుధుడు కూడా. ఇక మీకు ఈ వారంలో వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. రవి ప్రతికూలుడు అయినాడు గనుక తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచించాలి. తల్లిగారి ఆరోగ్యం బావుంటుంది. పిల్లలు కూడా మీకు అనుకూలమైన ఫలితాన్ని తెచ్చి పెట్టబోతున్నారు. కోర్టు వ్యవహార విషయాల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ మంచి వార్త వినే అవకాశం వుంది. మీకు అనుకోని లాభం ఏదో చేకూరనుంది. పదిహేనో తేదీ దాటాక మీకు అనారోగ్య సూచనలు మాత్రం ఉన్నాయి. రవి బుధులు శత్రువు ఇంట్లో కలుసుకోనున్నారు. అది ప్రధానమైన అంశము. కృత్తిక వారికి సాధన తారతో వార ప్రారంభం శుభప్రదం. రోహిణికి ప్రత్యక్తార కావున ఫలితాంశం తక్కువగా ఉంది. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి క్షేమ తార శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : పితృదేవతలను ఎక్కువగా స్మరించండి. శనికి జపం చేయించండి. శనివారం ఉపవాస నియమాన్ని పాటించండి.

మిధున రాశి :

ఈ లగ్నం వారికి బుధ శుక్రులు యోగ కారకులౌతున్నారు. మంచి ఫలితాలని ఎక్కువగా పొందే అవకాశం వీరికుంది. శుక్రుడు పంచమ వ్యయాధిపతి అయిన సంతానం ద్వారా వీళ్ళకి మేలుకు చేకూరుస్తాడు. ద్రవ్యాన్ని నష్ట పరుస్తాడు. కుటుంబ వ్యవహారాల విషయంలో చిన్న ఆటంకాల్ని కలిగిస్తాడు. ఏది ఏమైనా వీరికి బుధుడి తాలూకు ప్రయోజనం ఎక్కువగా ఉంది. అనుకోకుండా వీళ్లకి లాభాలు సహజంగానే కలిసి వస్తూ ఉంటాయి. కానీ ఈ వారంలో అష్టమ నవమ ఆధిపత్యం పొందిన శని సప్తమంలో ఉండటం వల్ల కొంచెం మానసిక ఆందోళన కలిగించే అవకాశం ఉంది. వీరు కోపాన్ని నిగ్రహించు కోవాల్సిన సమయం. మనస్సును శాంతపరచి కోవాల్సిన సమయం. వీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిని పొందగలుగుతారు. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి క్షేమ తార గావున శుభ ఫలితాలు ఎక్కువ. ఆరుద్ర వారికి విపత్తార గావున అశుభ ఫలితాలున్నాయి. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి మాత్రమే సంపత్తార గావున ఆర్థిక లాభాదులు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : ఈ రాశివారు విష్ణు సహస్ర నామ పారాయణ శుభ ఫలితాలని ఇస్తుంది. తులసి దళాలతో విష్ణువును పూజించండి.

కర్కాటక రాశి :

ఈ రాశివారికి అయిదుగురు శుభులు. వారం ప్రారంభం నాటికి అందులో ఐదు గ్రహాలు స్వక్షేత్ర మిత్ర క్షేత్రాలు ఉండడం మంచి ఫలితాలని ఇస్తారని అంటోంది శాస్త్రం. అనుకోని సంఘటనల ద్వారా వీరు మేలు పొందే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల విషయంలో చక్కని సూచనలను పొందుతారు. రావలసిన బాకీలు వసూలగుట లేదా కోర్టు వ్యవహారాల్లోని విజయాన్ని పొందుతారు. కొత్త ఉద్యోగాన్ని లేదా ఒక కుటుంబాన్ని సమకూర్చుకునే అవకాశం కూడా ఉంది. పుష్యార్క యోగం గనుక ఆదివారం నాడు బాగా పనికొస్తుంది. అంచేత అవకాశం ఉంటే ఈ రాశివారు ఆదివారంనాడు బంగారం కొనడం మంచిది. అలా కానప్పుడు సూర్యునకు ఎదురుగా ఉండి ఏదైనా మంత్ర జపం చేస్తే సాధన జరుగుతుంది. అది మంచిది. పునర్వసు నాలుగో పాదం వారికి సత్ఫలితాలెక్కువ. పుష్యమి వారికి జన్మతార అయినా కూడా శుభఫలితాలున్నాయి. ఆశ్రేష వారికి పరమమిత్రతార అవడం వల్ల శుభ ఫలితాలు శుభపరిణామాలు కూడా ఉన్నాయి.

పరిహారం : ఈ రాశివారు ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయండి. యోగసాధన చేయండి. ఏ మంత్రాన్ని సూర్యునికి ఎదురుగా ఉపాసన చేసినా సత్ఫలితాన్ని ఇస్తాడు .

సింహ రాశి :

ఈ రాశివారికి శుభ ఫలితాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ వారంలో కొంచెం ఇబ్బంది కలిగిన తరువాత శుభఫలితాలకు అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడే అవకాశం ఉంది. కొత్త స్థలాన్ని కొత్త యోచన గాని కొత్త వ్యక్తులు గానీ మీ జీవితంలో ప్రవేశిస్తారు. వివాహం కావలసిన పిల్లలకు సత్సంబంధాలు చేర్చుకునే అవకాశం ఉంది. మీరు వ్యక్తిగతంగా కూడా కొద్దిపాటి ప్రయత్నాలు చేస్తే ఉద్యోగంలోనూ గానీ వ్యాపారం లో గాని అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో అంటే భార్య వైపునుంచి మాత్రం మీకు వ్యతిరేకత తప్పదు. మీకు ఎల్లప్పుడూ గురువులు పెద్దవారు పితృదేవతల ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి గనుక మీ పనులు వాటంతట అవే చక్కబడతాయి. మఖా నక్షత్రం వారికి మిత్ర తారతో వారం ప్రారంభం గనుక చాలా శుభఫలితాలున్నాయి. పుబ్బ వారికి నైధన తార అయింది గనుక ఫలితాలు మధ్యమంగా ఉంటాయి. ఉత్తర ఒకటో పాదం వారికి సాధన తారతో వారం ప్రారంభం గనుక మంచి ఫలితాలే పొందనున్నారు.

పరిహారం : వీరు ఆదివారం సూర్య నమస్కారాలు చేయించుకోవడం ఆదిత్య హృదయం చేయండి విష్ణువుకు తులసీదళాలతో అర్చనలు చేయించండి.

కన్యా రాశి :

ఈ రాశివారికి బుధ శుక్ర శనులు శుభులై యున్నారు. రెండు మూడు నాలుగు స్థానాల్లో ఉన్న తాత్కాలిక మిత్ర గ్రహాలు కూడా వీరికి యోగిస్తున్నాయి. కుజుడు ఆధిపత్య పాపి అవ్వడం వల్ల వ్యతిరేకత ఎక్కువగా ఉంది . గురు రవి చంద్రులు కూడా వీరికి సహకారం అందనివ్వకుండా వ్యతిరిక్తంగా పనిచేస్తారు. ఇందువల్ల మీరు సమస్యల్ని ఎదుర్కొనే అవసరం ఉంది. అయితే శుక్ర శనులు వీరికి సహకరిస్తారు కాబట్టి కష్టాల్ని అధిగమించి శుభాన్ని పొందగలుగుతారు. ద్వితీయ కుటుంబ అధిపతి బుధుడు యోగించాలి. అయితే రవి బుధులు కలిసినప్పుడే ఈ యోగము మీకు చేకూరనున్నది. పదిహేనో తేదీ నుంచి మీ జాతకంలో కొద్దిపాటి మార్పును మీరు చూడగలుగుతారు మీరు మీ కుటుంబ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి సాధన తారైంది గావున శుభ ఫలితాలు ఎక్కువ . హస్తవారికి ప్రత్యక్ తారైంది గావున మధ్యమంగా ఉంటుంది. చిత్త ఒకటి రెండు పాదాల వారికి క్షేమ తారైంది కావున శుభఫలితాలున్నాయి .

పరిహారం : 14వ తేదీ నాడు భౌమ చతుర్ధి సంకష్ట హర చతుర్థి భోగి పండుగ కాబట్టి ఆవుపేడ పిడకలతో హోమం చేసినా లేదా అపిడకలు భోగి మంటల్లో వేసిన శుభ ఫలితాలని పొందగలుగుతారు.

తులా రాశి :

ఈరాశి వారికి శని బుధ శుక్రులు యోగ కారకులు. తృతీయ ముందున్నప్పటికీ శని మేలును జేయ వచ్చును కానీ రవితో కలిసి ఉండటం వల్ల సత్ఫలితాలు ఇవ్వలేడు. పదిహేనో తేదీ ఉదయం మకరం లోకి మారిపోయిన దగ్గర్నుంచి శని తన ప్రయోజకత్వాన్ని చూపిస్తాడు. అంతేకాదు బుధుడు రవి శత్రువు సమక్షేత్రాల్లో ఉన్నప్పటికీ బుధులు కలిసి ఉండటం కూడా మంచిది అవుతుంది. ఆధిపత్య పాపి అయినా కుజుడు ద్వితీయస్థానం మందు ఉండటం వల్ల ఆరోగ్యానికి ధనానికి చీకాకులు ఏర్పడడానికి అవకాశం ఉంది. పంచమ స్థానాధిపత్యము వచ్చిన శని వీరికి వాహన యోగాన్ని ఇవ్వచ్చు. దానికి తోడు గృహము బంధువులు సుఖశాంతులను పొందే అవకాశం కూడా ఉంది. వీళ్ళ జ్ఞానము పాండిత్యము పదిమందికి వినియోగపడే స్థితి వస్తుంది. చిత్ర మూడు నాలుగు పాదాలు వారికి క్షేమ తారు గావున శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. స్వాతి నక్షత్రం వారికి విపత్తార గావున శుభ ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి సంపత్తార గావున ధనలాభం చేకూరనుంది.

పరిహారం : ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతలు యొక్క అనుగ్రహం పొందడం వీరికి చాలా ఉపయోగకరంగా వుంటుంది. మంగళవారం నాడు అమ్మవారిని పూజించిన సత్ఫలితాలు కలుగుతాయి కనుమనాడు గోపూజ చేయండి.

వృశ్చిక రాశి :

ఈ రాశివారికి శుభ పరంపరలు కొద్దికొద్దిగా ప్రారంభం కానున్నాయి. ఈ వారంలో మంచి ఫలితాలను చూస్తారు. మంచిస్థానంలో గ్రహాలు ఉన్నందువల్ల తాత్కాలిక మిత్రులై కొందరూ ఆధిపత్య శుభులై కొందరు యోగించనున్నారు. వీరికి ఏల్నాటి శని ప్రభావం పూర్తిగా తగ్గుతుందనే చెప్పొచ్చు. వీరికి మంచి రోజులు సంప్రాప్తం కానున్నాయి. ఉత్తరాయణం ప్రారంభం నుంచి వీరికి మంచి రోజులు ప్రారంభం అనే చెప్పొచ్చు. ఈ మంచి రోజుల్ని వినియోగించుకుంటున్న కొద్దీ వీరికి శుభపరంపర కొనసాగుతుంది. లగ్నాధిపతి కుజుడు లగ్నంలో ఉండటం షష్టాధిపత్యం కూడా అతనికి రావడం వల్ల యోగ ప్రదుడు అవుతున్నాడు. కుటుంబ పంచమ అధిపతి గురుడు స్వక్షేత్రంలో ఉన్నందున గృహమునందు కల్యాణ ప్రదమైన వాతావరణం నెలకొంటుంది. విశాఖ నాలుగో పాదం వారికిశుభ ఫలితాలు ఉన్నాయి. అనూరాధ వారికి జన్మతార యినప్పటికీ సత్ఫలితాలు కలుగనున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయినందువల్ల శుభ ఫలితాలు ఉన్నాయి.

పరిహారం : వీరు 15 వతేదీన పుష్యార్క యోగాన్ని వినియోగించుకోవటం సూర్యస్తో త్రం చేయటం చాలా మంచిది. బుధ వారం నాడు శ్రీమహావిష్ణువును తులసి దళాలతో అర్చించండి. మంగళవారం గోదాదేవి కల్యాణంలో పాల్గొనండి మంచి జరుగుతుంది.

ధనూ రాశి :

ఈ రాశివారికి రాశ్యాధిపతి గురుడు రవితో కలిసి యోగించనున్నారు. ఈ రాశికి రవి గురు చంద్ర కుజులు శుభులై ఉన్నారు . ఆధిపత్య పాపులైన బుధ శుక్రులు తాత్కాలిక మిత్రులు అవ్వడం వల్ల ఈ వారంలో వీరు మంచి ఫలితం పొందబోతున్నారు. వీరికి ఏల్నాటి శని ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా రవి ప్రభావం చేత కొంచెం ఆటుపోట్లు తట్టుకునే శక్తి వస్తుంది. మానసిక ధైర్యం కూడా లభించనున్నది.వాక్ స్థాన అధిపతియైన శని బాగులేదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. నేత్ర వ్యాధికి అవకాశం. వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానాధిపతి అయిన బుధుడు కూడా వ్యతిరేకి కనుక సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా మాటల్ని పొదుపుగా వాడటం మంచిది. అలాగే శివదీక్ష చేస్తే ఎక్కువ మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. పన్నెండవస్థానం కుజుని స్థానమే అయినా తాత్కాలిక మిత్రుడు యోగా కారకుడైనాడు గనుక మీకు ఒక మంచి లాభం చేకూరుతుంది. మూలా నక్షత్రం వారికి మిత్ర తారతో వార ప్రారంభం గనుక శుభ ఫలితాలు పొందుతారు. పూర్వాషాఢ వారికి నైధన తారతోవారం ప్రారంభం కాబట్టి వ్యతిరేక ఫలితాలను పొందే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాషాడ ఒకటో పాదం వారికి సాధాన తార కావుణ శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నా యి.

పరిహారం: ఈ రాశివారు గురుని స్తుతిస్తూ తిరువనం చేయండి అలాగే దక్షిణామూర్తి స్తోత్రం పట్టణం కూడా చేయండి శివకేశవులను అర్చిస్తే మంచిది .

మకర రాశి:

ఈ రాశివారికి ముగ్గురు ఆధిపత్య శుభులు అయినా వీరికి ఏలినాటి శని ప్రభావం బాధిస్తుంది.కానీ ఈ వారంలో కొద్దిపాటి శుభ ఫలితాలని పొందబోతున్నారు శుక్రుడు వీరికి వాక్కు ధన కుటుంబ స్థానంలో ఉన్నాడు గనుక ఈ ఈ మూడింటిని అధీనంలో ఉంచుకోగలిగితే ఎన్నడు శని ప్రభావము కనిపించదు లేకపోతే ఏలినాటిశని ప్రభావము మిమ్మల్ని బాధిస్తుంది మీ వ్యక్తిత్వం ద్వారా మీరు చాలా విషయాల్ని దాటగలిగే అవకాశం ఎక్కువగా ఉంది అన్నదమ్ముల సౌఖ్యం కొంత తగ్గినా సరే ఇబ్బంది లేదు మాతృపితృ స్థానాలు బాగులేవు వెనుక వారిపై దృష్టి పెట్టండి బంధువర్గాన్ని ఎక్కువగా కలుసుకుని తద్వారా మీకు తద్వారా మీకు పేరు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి ఉత్తరాషాఢ వారికి శుభ పరంపరలు కొనసాగుతాయి.శ్రవణం వారికి ప్రత్యక్ తార గనుక శుభ ఫలితాలు తక్కువని చెప్పాలి. ధనిష్ఠ ఒకట్రెండు పాదాల వారికి క్షేమ తయారైన అయ్యింది కావున శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి .

పరిహారం: వీరు శనికి తైలాభిషేకం చేయించండి పదిహేనో తేదీ సంక్రాంతి నాడు పితృదేవతలు ప్రీతిగా దానధర్మాలు చేయండి నల్లని వస్త్రదానం శుభ ఫలితాలని ఇస్తుంది అలాగే పుష్యార్క యోగం ఆదివారం వుంది కనుక వీలైతే సూర్య ప్రార్థనలు చేయండి మంచి ఫలితాలను పొందగలుగుతారు .

కుంభ రాశి :

ఈ రాశికి అధిపతి శని శుక్రులు సాధారణ శుభ ఫలితాలని ఇవ్వబోతున్నారు. ఏదైనా సరే మీ ఆరోగ్యం మీ కుటుంబ ఆరోగ్యం పైనా దృష్టి పెట్టండి. పిల్లలు కూడా మీ మాటల్ని వినే అవకాశం తక్కువగా ఉంది. పంచమ అష్టమాధిపత్యం వచ్చిన బుధుడువల్ల మీ ఆలోచన స్థిరం తక్కువై మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తుంది. అనవసర వ్యయాన్ని మీరు చెయ్యక తప్పదు. మీకు ద్వితీయ స్థానం అధిపతి అలాగే ఏకాదశ స్థానాధిపతి గురుడు తాత్కాలిక మిత్రత్వం వల్ల కూడా సుఖాన్ని పొందనున్నారు. ధనిష్ట మూడు నాలుగు పాదాల వారికి క్షేమ తారగావున శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. శతభిషం వారికి విపత్తార గావున వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారికి సంపత్తార గావున ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి.

పరిహారం : మీరు శుక్రవారం నాడు అమ్మవారికి పూజించండి లేదా దేవీ ఖడ్గమాలా పారాయణ చేయండి. మంగళవారం నాడు నియమం పాటించండి బుధవారం నాడు పితృదేవతల ప్రీతిగా దానధర్మాలు చేయండి.

మీన రాశి :

ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. పది పదకొండు పన్నెండు స్థానాల్లో ఉన్న ఆరు గ్రహాలు వీరికి కొద్దిపాటి సౌఖ్యాన్ని శుభాన్ని కలుగజేయ నున్నాయి. ధన స్థానం అధిపతి ఐన కుజుడు ఆరోగ్య రీత్యా వ్యయం చేయనున్నాడు. వృత్తి వ్యాపారాల కారకుడైన గురుడు ఒక మంచి గౌరవాన్ని గానీ వృత్తి వ్యాపారాలను గాని ఇవ్వనన్నాడు. ఈ వారం చివరికి అదృష్ట దురదృష్టాలు ఒకదాని వెంట ఒకటి ఉన్నాయి. మనోజవంతు మాండవ్య అన్నట్టుగా వీరు శీఘ్రంగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అన్నదమ్ముల స్థానానికి అధిపతి ఐన శుక్రుడు తాత్కాలిక మిత్రులు అవ్వడం వల్ల కూడా కుటుంబాలు కలిసే అవకాశం ఉంది. చతుర్థ స్థానాధిపతి మాతృస్థానం బుధుడు అయ్యాడు గనుక ఆమె ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనలో ముంచెత్తుతుంది. పండుగ రోజుల్లో మీరు ఇబ్బందిని ఎదుర్కొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. పూర్వా భద్ర నాలుగో పాదం వారికి సంపత్తార గావున బాగుంది. ఉత్తరాభాద్ర వారికి జన్మ తారతో వారం ప్రారంభం గనుక అధిక ప్రయాస తప్పదు. రేవతి వారికి పరమ మిత్ర తారైంది కనుక శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది.

పరిహారం: వీరు పదిహేనో తేదీన పితృదేవతలకు ప్రీతికరంగా వస్త్రదానం అన్నదానం లేదా పిండ ప్రదానం విధివిధానంగా చేయడం విష్ణు సహస్రనామ పూజ సత్పలితాలను ఇస్తాయి .

Next Story