ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్థంతి

By సుభాష్  Published on  20 May 2020 2:48 PM GMT
ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్థంతి

ముఖ్యాంశాలు

  • మే 21 జాతీయ ఉగ్ర‌వాద వ్య‌తిరేక దినోత్స‌వం

  • శ్రీపెరంబదూర్‌లో రాజీవ్‌ హత్య

  • రాజీవ్‌ గాంధీ హత్యకు 29 ఏళ్లు

  • రాజీవ్‌గాంధీ లక్ష్యంగా పేలుడన్న నళిని

భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని తమిళనాడులోని చెన్నై సమీపంలో గల శ్రీపెరంబదూర్‌లో 1991 మే 21న ఎల్‌టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం బాంబు పేల్చి హతమార్చారు. నళిని, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్‌ ఎల్‌టీటీ ఉగ్రవాదులతో కలిసి రాజీవ్‌ గాంధీ హత్యకు కుట్రపన్నారు. మే 21న రాత్రి పది గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది.

పేలుడు జరిగిన సమయంలో రాజీవ్‌తో పాటు పలువురి శరీరాలు ముక్కలు ముక్కలుగా ఎగిరి పడ్డాయి. ఈ కేసులు నళిని, మురుగన్‌తో పాటు ఏడుగురు దోషులుగా తేల్చారు. అయితే నళినికి ముందుగా మరణ శిక్ష విధించారు. 2000 ఏప్రిల్‌ 24న ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. నళిని ఇప్పటి నుంచి ఇప్పటి వరకూ వేలురులోని మహిళల కారాగారంలో శిక్ష అనుభవిస్తోంది. ప్రపంచంలో అత్యధిక కాలం జైలులో ఉన్న మహిళ నళినినే. ఆమె భర్త మురుగన్‌ కూడా వేలూరు పురుషుల జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. రాజీవ్‌ హత్య ఘటన విషయంలో నళిని ఇప్పటికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తోంది. అయితే రాజీవ్‌ గాంధీ లక్ష్యంగానే పేలుడు జరిగిందని నళిని నిర్ధారించారు.

40 ఏళ్ల వయసులో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ గాంధీ అప్పట్లో పిన్నవయస్కులైన నేతల్లో ఒకరు. రాజీవ్‌గాంధీ 1944లో ఆగస్ట్‌ 20న ముంబైలో జన్మించారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించేనాటికి ఆయన తాతా ప్రధానమంత్రి అయ్యేనాటికి రాజీవ్‌ వయసు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఆయన తల్లిదండ్రులు లక్నో నుంచి ఢిల్లీకి మకాం మార్చారు.

కాగా, 1984 అక్టోబర్‌ 31న తల్లి ఇందిరాగాంధీ దారుణహత్యకు గురైన సమయంలో ప్రధాన మంత్రిగాను, కాంగ్రెస్‌ అధ్యక్షునిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 1991లో మే 21న రాత్రి పది గంటలకు శ్రీపెరంబదూర్‌లో ఒక యువతి ఒక గంధపు మాల తీసుకుని రాజీవ్‌గాంధీ వైపు మళ్లింది. ఆమె ఆయన పాదాలను తాకేందుకు వంగగానే.. చెవులు పగిలిపోయేలా ఒక పేలుడు సంభవించింది. పెరంబదూర్‌లో భయంకర పేలుడు జరిగిన సమయంలో తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు మూనార్‌, జయంతి నటరాజన్‌, రామమూర్తి అక్కడే ఉన్నారు.

దట్టమైన పొగలు కమ్ముకోవడంతో రాజీవ్‌గాంధీని వెతకడం ప్రారంభించారు. అప్పటి ఆయన శరీరంలో ఒక భాగం, సగం తల కనిపించింది. ఆయన కపాలం ముక్కలైపోయింది. దాని నుంచి బయటికొచ్చిన మెదడు, ఆయన సెక్యూరిటీ అధికారి పీకే గుప్తా కాళ్లపై పడి ఉంది.

కాగా, రాజీవ్‌ గాంధీని చూసేందుకు వచ్చిన జనాల్లో చాలా మంది నల్లటి మాంసపు ముద్దల్లా మారిపోయారు. ఆ రోజు అందరి శరీరాలు ముక్కలు ముక్కలుగా మారిపోయాయి. రాజీవ్‌ సెక్యూరిటీ అధికారి ప్రదీప్‌ గుప్తా కొంత సేపు ప్రాణాలతో బతికినా తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత రాజీవ్‌ గాంధీ శరీరం కనిపించింది. ఆయన లోటో బూట్లు, తెగిపడిన చేయి, దానికి ఉండే వాచ్‌లను చూసి అవి రాజీవ్‌ గాంధీయేనని నిర్ధారించారు.

రాజీవ్‌ హత్య జరిగిన రోజు 10 గంటల 25 నిమిషాలకు ఢిల్లీలో రాజీవ్‌ నివాసం 10 జన్‌పథ్‌ వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అప్పటికే సోనియా, ప్రియాంకా కూడా నిద్రకు ఉపక్రమించారు. అయితే రాజీవ్‌గాంధీ ప్రైవేటు సెక్రటరీ జార్జ్‌కు ఓ ఫోన్‌ వచ్చింది. రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారనే వార్త తెలియగానే ఇంటిలోపలికి పరుగెత్తి సోనియాగాంధీకి తెలియజేయడంతో ఆమె వెంటనే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నోటి మాట రాలేదు.

ఇక రాజీవ్‌ హత్య నుంచి మే 21 జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుతూ వస్తున్నారు. తీవ్రవాద చర్యలు రూపుమాపి, దేశ ప్రజలు సహజీవనంతో మెలగాలన్నది ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న భావాన్ని ప్రజల్లో కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారిచే తీవ్రవాద వ్యతిరేక దినం ప్రతిజ్ఞ చేస్తారు.

Next Story
Share it