Fact Check : అస్సాం కాంగ్రెస్ నేత మారణాయుధాలతో పట్టుబడ్డాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2020 9:51 AM GMT
Fact Check : అస్సాం కాంగ్రెస్ నేత మారణాయుధాలతో పట్టుబడ్డాడా..?

రెండు ఫోటోలు.. ఒక ఫోటోలో ఓ వ్యక్తి చేతికి బేడీలు వేసి ఉంచారు.. అతడి చుట్టూ పోలీసు అధికారులు చేరారు. మరో ఫోటోలో హ్యాండ్ గ్రెనేడ్స్, బుల్లెట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ఫోటోల్లో పోలీసులు బేడీలు వేసిన వ్యక్తి అస్సాం కాంగ్రెస్ నేత అంజాద్ అలీ అని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. మారణాయుధాలను సరఫరా చేస్తున్నారనే అభియోగాలతో అతడిని అరెస్టు చేసారని చెబుతూ ఉన్నారు.

Ass

ఎంతో మంది సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలను పోస్టు చేస్తూ ఉన్నారు. మారణాయుధాలను సరఫరా చేయాలని అతడు అనుకుంటూ ఉన్నాడని.. ముస్లిమేతరులను చంపడానికి అతడు కుట్ర పన్నాడంటూ పలువురు పోస్టులు పెడుతూ వచ్చారు.

నిజ నిర్ధారణ:

అస్సాం కాంగ్రెస్ నేత అంజాద్ అలీ మారణాయుధాలను సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు అనే కథనాల్లో ఎటువంటి నిజం లేదు. ఈ వైరల్ పోస్టు 'పచ్చి అబద్ధం'.

అంజాద్ అలీ అనే పేరు ఉన్న నేతకు సంబంధించి.. అస్సాం కాంగ్రెస్ పార్టీలో వెతకగా my.neta.info లో ఎటువంటి వివరాలు కనిపించలేదు.

http://myneta.info/search_myneta.php?q=Amjad+ali

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అదే ఫోటో 2018లో పబ్లిష్ చేయడం గమనించవచ్చు. ఆ కథనం ప్రకారం ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ముబారక్ హుస్సేన్, మద్రసా టీచర్. బాంగ్లాదేశ్ లోని మెమెన్సింగ్ జిల్లాలో నాలుగు తరగతి చదువుతున్న బాలిక మీద లైంగిక దాడికి పాల్పడినందుకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు వేసుకున్న దుస్తుల్లో కూడా చాలా తేడాలు ఉండడాన్ని గమనించవచ్చు. మెమెన్సింగ్ జిల్లా పోలీసులు అతడిని పట్టుకున్న ఘటనకు సంబంధించిన విషయాన్ని కూడా ధృవీకరించారు. ఈ ఘటన బాంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది.

మరో ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2018లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. 'శ్రీనగర్ పరిసరాల్లో చోటు చేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు గాయపడ్డాడు. వారి దగ్గర నుండి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణ మొదలుపెట్టారు.' అంటూ పోస్టు పెట్టడాన్ని గమనించవచ్చు.

Rising Kashmir, Greater Kashmir మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాయి. పోలీసులకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నూరా ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని ధృవీకరించారు.

ఈ పోస్టుల్లో వైరల్ అవుతున్న రెండు ఫోటోలు వివిధ ఘటనలకు సంబంధించినవి. అస్సాం కాంగ్రెస్ పార్టీ నేత ముస్లిమేతరులను చంపాలనే ఉద్దేశ్యంతో మారణాయుధాలను సరఫరా చేస్తున్నాడనే పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.

Also Read

Next Story