మఫ్లర్ మ్యాన్ మరో వింత నాటకం

By అంజి  Published on  22 Jan 2020 4:36 AM GMT
మఫ్లర్ మ్యాన్ మరో వింత నాటకం

మామూలుగా ముఖ్యమంత్రి ఎక్కడికైనా బయలుదేరితే ముందస్తు సెక్యూరిటీ సైరన్ మోగుతుంది. అడ్వాన్స్ పార్టీ రోడ్డును క్లియర్ చేస్తుంది. ముఖ్యమంత్రి ముందస్తు ప్రోగ్రామ్‌ను అధికారులు చూస్తారు. సెక్యూరిటీ క్లియరెన్సులు ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి వెళ్లే సరికి చేంతాడంత పొడవైన క్యూ ఉండి, “ఆప్ కతార్ మే హై” అని ఎవరైనా ఎక్కడైనా చెప్పారా? ఆయన సిబ్బంది ముందస్తుగా పరిస్థితేమిటో చూసి ముఖ్యమంత్రికి చెప్పరా?

ఎన్నికల వేళ ఢిల్లీలో సోమ, మంగళ వారాల్లో ముఖ్యమంత్రి ఇలాంటి వింత, విచిత్ర, విడ్డూర నాటకానికి తెరతీశారు. సోమవారం అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయాలి. ఆయన భారీ ఊరేగింపుగా బయలుదేరారు. ఆయనకు అడుగడుగునా స్వాగతం లభించింది. ఎంత స్వాగతం లభించిందంటే ఆఖరికి ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. అంటే ఆయన, ఆయన సిబ్బంది, ఆయన మద్దతుదారులెవరూ గడియారం సైతం చూడలేదన్న మాట. ఎవరూ “సార్... టైమైపోతోంది” అని ఆయనకు చెప్పనే లేదన్నమాట. ఆయనకు నామినేషన్ వేయడం కన్నా దండలు వేయించుకోవడం ముఖ్యమన్న మాట..!!

సరే... మంగళవారం నామినేషన్ వేయాలని మళ్లీ కేజ్రీవాల్ బయలుదేరారట. ఆయన వెళ్లే సరికి ఆయన కన్నా ముందే అరవై మంది నామినేషన్లు దాఖలు చేసేందుకు క్యూలో ఉన్నారట. దాంతో ఆయనకు అధికారులు టోకెన్ ఇచ్చి కూర్చోబెట్టారు. అరవింద్ కేజ్రీవాల్ మూడు గంటలు ఎదురు చూడాల్సి వచ్చిందట. ఆయన రూమ్ లో వేచి చూస్తున్న ఫోటోలు పేపర్ల నుంచి ట్విట్టర్ల దాకా ఠపఠపా పడిపోయాయి. దీనికి తోడు “చూడండి “మన ఆమ్ ఆద్మీ” (మామూలు మనిషి)” అనుకునేలా కామెంట్ల రచ్చ రచ్చ. అసలు ముఖ్యమంత్రి స్థాయి మూడు గంటలు ఎలాంటి రక్షణా లేకుండా ఒక అసురక్షితమైన చోట కూర్చునేలా చేసిన సెక్యూరిటీ ఆఫీసర్ల ఉద్యోగాలేం కావాలి? ఎన్ని సంజాయిషీలు ఇవ్వాలి?

అంతా అయిన తరువాత కేజ్రీవాల్ నామినేషన్ పత్రాలు ఫైల్ చేసి, ఆ తరువాత ఇంత మంది అభ్యర్థులు ఒకేసారి వచ్చి నన్ను ఆడ్డుకునేందుకు కుట్ర పన్నారని, ఈ కుట్ర వెనక బిజెపి, కాంగ్రెస్ లు ఉన్నాయని ఆరోపించేశారు. వాస్తవానికి ఇలా చేయడం వల్ల విపక్షాలకు కలిసొచ్చేదేమిటి? ఆయన నామినేషన్ ను ఆపగలరా? ఆపలేనప్పుడు ఈ డ్రామా ఆడితే వారికి లాభం ఏముంటుంది? ఈ డ్రామా వల్ల ఇమేజీ పెరిగేది కేజ్రీవాల్‌కే అయినప్పుడు, విపక్షాలు ఎందుకు ఈ పనికి పూనుకుంటాయి? నామినేషన్ పేరిట అరవింద్ కేజ్రీవాల్ కు రెండు రోజుల ప్రచారం ఇచ్చేందుకు బిజెపి, కాంగ్రెస్ లు ఎందుకు పనిచేస్తాయి?

ఏమో బాబూ... కేజ్రీవాల్ విపక్షాల కుట్ర అంటున్నా.. మా కామన్ సెన్స్ కు ఏదో తేడా కొడుతోంది. “రంగం” సినిమాలో ముఖ్యమంత్రి అభ్యర్థి తనపైనే దాడి చేయించుకుని ప్రచారం చేయించుకున్న కహానీ గుర్తుకు రావడం లేదూ? అయినా ఎనీ థింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ పాలిటిక్స్!! ఆ విషయం మన మఫ్లర్ మ్యాన్ కి తెలిసినంతగా మరెవరికీ తెలియదు.

Next Story