పథకం ప్రకారం జవాన్ ను చంపి..కనిపించడం లేదంటూ..

By రాణి  Published on  25 Feb 2020 12:51 PM GMT
పథకం ప్రకారం జవాన్ ను చంపి..కనిపించడం లేదంటూ..

దేశాన్ని రక్షిస్తూ..ఎండనక, వాననకా..చలి అనకా..మంచుకొండల్లో, ఎడారుల్లో పహారా కాస్తూ..తమ జీవితాన్ని దేశానికి అంకితమిస్తున్న జవాన్లకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. అలాంటి జవాన్ ను తన సుఖం కోసం ప్రియుడితో కలిసి హతమార్చిందో భార్య. పైగా భర్త కనిపిండటం లేదంటూ హై డ్రామా చేసింది.

బెళగావి తాలూకా మారిహలకు చెందిన దీపక్ పట్టణధార్(32) 14 సంవత్సరాలుగా సైన్యంలో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితమే అతనికి అంజలి అనే యువతితో వివాహమవ్వగా..వీరికి రెండేళ్ల కూతురు ఉంది. కాగా..దీపక్ ఆరునెలలకోసారి ఇంటికొచ్చి వారంరోజులుండి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో బెళగావి తాలూకాలోని హోన్నిహళ గ్రామంలో స్థలం తీసుకుని..అక్కడే ఇల్లు కూడా కట్టించాడు. అందులో దీపక్ భార్య కుమార్తెతో ఉండేది. కారు కూడా కొనివ్వడంతో పాటు దానిని నడిపేందుకు ప్రశాంత్ అనే యువకుడిని డ్రైవర్ గా నియమించాడు. మళ్లీ యథావిధిగా విధులు నిర్వర్తించేందుకు దీపక్ వెళ్లిపోయాడు. ఇంట్లో అంజలి, తన రెండేళ్ల కూతురు మాత్రమే ఉంటుండటంతో..డ్రైవర్ ప్రశాంత్ తో మొదలైన స్నేహం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది.

కొన్నాళ్లు ఇలాగే గుట్టుచప్పుడు కాకుండా తమ అక్రమ సంబంధాన్ని నడిపించారు. జనవరి మూడోవారంలో సెలవు పెట్టి వచ్చిన దీపక్..ఇక తాను ఆర్మీ నుంచి రిటైర్ అయి..కర్ణాటక పోలీస్ శాఖలో చేరుతానని భార్యతో చెప్పాడు. ఇది నచ్చని అంజలి..దీపక్ ఊర్లోనే ఉంటే డ్రైవర్ తో తన ఆటలు సాగవని గ్రహించి..భర్తను అడ్డు తొలగించాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఆ విషయాన్ని ప్రియుడికి చేరవేసింది. పదకం ప్రకారం..జనవరి28వ తేదీ గోకాక్ గోడచనమల్లి జలపాతానికి కారులో వెళ్లారు. కాగా..మార్గమద్యంలో అంజలి బలవంతంగా దీపక్ చేత ఫుల్లుగా మద్యం తాగించి, గొంతు నొక్కి కారులోనే హత్య చేయించింది. అప్పటికే జలపాతం వద్దకు చేరుకున్న ప్రశాంత్ స్నేహితులు నవీన్ కెంగేరి, ప్రవీణ్ లు జవాన్ మృతదేహాన్ని జలపాతంలోకి విసిరేశారు.

అంతా సైలెంట్ గా జరిపించేసిన అంజలి..ఫిబ్రవరి 4వ తేదీన మారిహళ పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. పైగా పోలీసులు పట్టించుకోవడం లేదని పీఎస్ ఎదుట ధర్నా చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దీపక్ సెల్ నెంబర్ ఆధారంగా గోకాక్ జలపాతం పరిసరాల్లో గాలించారు. అక్కడ పక్షులు, చేపలు తినగా..కుళ్లిన స్థితిలో ఉన్న దీపక్ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు తరలించగా..అతడు హత్యకు గురైనట్లు తేలింది. అంజలి తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు..ఆమె మొబైల్ కాల్ డేటాను, డ్రైవర్ ప్రశాంత్ మొబైల్ కాల్స్ డేటాను పరిశీలించారు. వీరిద్దరినీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా..అసలు నిజం బయటపెట్టారు. ఫలితంగా ఇద్దరూ అరెస్ట్ అయి..ఇప్పుడు జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. అంజలి రెండేళ్ల కుమార్తె అనాథయింది.

Next Story