తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇప్పటికే వర్షాల కారణంగా వాగులు, వంకలు నిండిపోయాయి. పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో గేట్లను ఎత్తి దిగువన వదులుతున్నారు. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. సోమ, మంగళవారాల్లో తెలంగాణలో 90 శాతం వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురియనున్నట్లు తెలిపారు.

ఇక దట్టమైన మేఘాలు కమ్మకుని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిద్దిపేట, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, వరంగల్‌, మంచిర్యాల, పెద్దపల్లి, యాదాద్రి తదితర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో పిడుగులు పడే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆయా జిల్లాల్లోని కలెక్టర్లు అప్రమత్తంగా ఉన్నారు.

అలాగే ఆదివారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. సోమవారం మరింతగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈనెల 17 వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మరో వైపు ఈనెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

అల్పపీడనం కారణంగా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు మరి కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

సుభాష్

.

Next Story