22 నుంచి రోడ్లెక్కనున్న ఆర్టీసీ బస్సులు..!

By సుభాష్  Published on  13 May 2020 11:25 AM GMT
22 నుంచి రోడ్లెక్కనున్న ఆర్టీసీ బస్సులు..!

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన బస్సులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో బస్సులను రోడ్డెక్కించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలకు 18వ తేదీ కల్లా బస్సులను తప్పేందుకు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

బస్సు సీటింగ్‌లో మార్పు..

ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు మొదటి దశలో రీజియన్‌లో 635 బస్సులు రోడ్డెక్కించేందుకు అధికారులు నిర్ణయించారు. మంగళవారం అనంతపురం డిపోలో డిప్యూటీ సీఎంఈ మోహన్‌, డీఎం ఆర్‌ పిచ్చయ్య సూపర్‌ లగ్జరీ బస్సుల్లో సీటింగ్‌ ఏ విధంగా ఏర్పాటు చేయాలనే విషయం సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. బస్సుల్లో ఎక్కే ప్రయాణికులు సామాజిక దూరం పాటించేలా బస్సుల్లో ప్రత్యేక సీటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రతి బస్సుల్లో 50శాతం ప్రయాణికులే..

అలాగే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్నారు ఆర్టీసీ అధికారులు. అలాగే ప్రతి బస్సుల్లో 50శాతం మందే ప్రయాణించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఒక వేళ బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లయితే బస్‌స్టేషన్‌లలో కండక్టర్లు ఫోన్‌ పే, గూగుల్‌పే, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేస్తారని తెలుస్తోంది.

Next Story