మాజీ డీజీపీ తప్పుల చిట్టా ఇదేనా?

By రాణి  Published on  25 Feb 2020 12:03 PM GMT
మాజీ డీజీపీ తప్పుల చిట్టా ఇదేనా?

వివాదాస్పద మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు తన హయాంలో ఏరో స్టాట్, డ్రోన్లు తదితర పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పాలనాపరమైన ట్రైబ్యునల్ కు తెలియచేసింది. దాదాపు రూ. 25 కోట్ల ఈ కొనుగోళ్లు సర్వీసు నిబంధనలకు విరుద్ధమని, ఆలిండియా సర్వీసు రూల్స్ లోని 3(1) వ నిబంధనకు వ్యతిరేకమని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం డిప్యూటీ సెక్రటరీ జె.వెంకట మురళి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని ఆయన వాదించారు. అంతే కాక ఏబీ వెంకటేశ్వరరావుఐ అవినీతి కార్యకలాపాలు, చట్టవిరుద్ధమైన పనుల విషయంలో పలు కేసులు ఇప్పటికే ఉన్నాయని ఆయన వాదించారు. సీ ఏ టీ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్ ల ముందు ఆయన వాదించారు.

తాము ఏబీ వెంకటేశ్వరరావు పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరించలేదని, వివిధ దర్యాప్తుల్లో వెల్లడైన విషయాల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆయన రాష్ట్ర ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా ఇజ్రాయిలీ కంపెనీ ఆర్ టీ ఇన్ ఫ్లేటబుల్స్ కు ఈ ఆర్డర్ ను కట్టబెట్టారు. ఈ ఇజ్రాయిలీ కంపెనీకి స్థానిక ఫ్రాంచైజీగా వ్యవహరించిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీ సీఈఓ మరెవరో కాదు. ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడైన చేతన్ సాయి కృష్ణ. తన కుమారుడికి లబ్ది చేకూర్చే రీతిలో ఏబీ వ్యవహరించారని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.

ఈ కంపెనీ అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడిందని గుర్తించిన కార్ణంగా పర్చేజ్ ఆర్డర్ ను ఉద్దు చేయడం జరిగిందని కూడా ఆయన తెలిపారు. చేతన్ సాయి కృష్ణ కంపెనీకి మేలు చేసేందుకు స్పెసిఫికేషన్లను తగ్గించడం జరిగిందని కూడా వెల్లడైంది. యాన్యువల్ మెయింటెనెన్స్ విషయంలోనూ వివాదాలు తలెత్తినాయని, అప్పుడు కుమారుడి కంపెనీకి లాభం చేకూరేలా ప్రవర్తించారని ఆరోపణలు చేశారు.

అదే విధంగా ఎస్ ఐ బీ ఐజీ హాజరైన సమావేశంలో ఆయన తరఫున ఏబీ సంతకం చేశారు. ఇది సర్వీస్ కాండక్ట్ రూల్స్ లోని సెక్షన్ 4(3)ఎ కి పూర్తిగా విరుద్ధం. ఈ పరికరాలు ఎలా పనిచేస్తాయో చూపేందుకు డిమాన్ స్ట్రేషన్ ను కూడా నిర్వహించలేదు. అదే విధంగా ఇందుకు గాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, పౌరవిమానయాన శాఖ డైరక్టర్ జనరల్, విదేశీ వాణిజ్య విభాగపు డైరెక్టర్, టెలికామ్ అధికారుల నుంచి అవసరమైన లైసెన్సులను కూడా పొందలేదని ఆయన తెలిపారు.

వీటన్నిటి నేపథ్యంలోనే పర్చేస్ ఆర్డర్ ను క్యాన్సల్ చేసినట్టు ఆయన తెలిపారు. అయినప్పటికీ తన కుమారుడికి మేలు చేసేందుకు ఏబీ వెంకటేశ్వరరావు ప్రయత్నించారని వెంకట మురళి తెలియచేశారు. ఈ కేసులో సీ ఐడీ రిపోర్టు ఆధారంగానే ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశామని ఆయన తెలియచేశారు.

Next Story