పరీక్ష ఒకటే.. ఉద్యోగాలు ఎన్నో..

By Medi Samrat  Published on  6 Oct 2019 7:10 AM GMT
పరీక్ష ఒకటే.. ఉద్యోగాలు ఎన్నో..

ఇకపై అన్ని పోటీ పరీక్షలకు ఒకటే ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వ‌హించే దిశగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. నిరుద్యోగులపై పోటీ పరీక్షల ఒత్తిడి, ప్రభుత్వానికి పని మరియు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. ఒకే పరీక్షతో రకరకాల ఉద్యోగాలకు ఎంపిక అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో 'ఏపీపీఎస్సీ' దీనిపై దృష్టి సారించింది. అన్ని ఉద్యోగాలను మెడికల్, ఇంజనీరింగ్, సివిల్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్ ఇలా గ్రూపులుగా విభజించి ఒక్కొక్క గ్రూపుకు ఒక్కొక్క పరీక్ష నిర్వహిస్తుంది.

అయితే న్యాయ, ఆర్థిక మొదలైన ప్రత్యేక పోస్టులకు సంబంధించి విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెలాఖరులోపు 'ఏపీపీఎస్సీ' ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తే నిరుద్యోగుల సమస్యలు తీరనున్నాయి. విభిన్న ఉద్యోగాలకు వివిధ పరీక్షలు రాస్తూ అనుభవిస్తున్న కష్టాలనుంచి గట్టెక్కుతారు. ఇప్పటికే డిగ్రీ అర్హతతో వివిధ ఉద్యోగాలకు ప్రయత్నించే వారు వేర్వేరు పరీక్షలు రాస్తూ సమయాన్ని, డబ్బులు వృథా చేసుకుంటున్నారు.

గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాల కింద ఇటీవల ప్రకటించిన పోస్టుల్లో ఒకే పరీక్ష ద్వారా 4 రకాల పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుతం 'ఏపీపీఎస్సీ' తీసుకునే నిర్ణయం ద్వారా ఇదేవిధంగా ఒకే పరీక్షతో వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రతి ఏడాది క్యాలెండర్ విధానంలో పోస్టుల భర్తీకి 'ఏపీపీఎస్సీ' ఇప్పటికే అంగీకరించింది.

Next Story