రైతు ఆత్మహత్యల్లో తెలుగు రాష్ట్రాల దారుణ రికార్డు

By సుభాష్  Published on  2 Sep 2020 6:22 AM GMT
రైతు ఆత్మహత్యల్లో తెలుగు రాష్ట్రాల దారుణ రికార్డు

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరో చెత్త రికార్డు నమోదైంది. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో అమలు కాని భారీ సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతుంటాయి. ఇక.. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు లాంటి స్కీంను ప్రవేశ పెట్టింది తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో. మరి.. ఇన్ని చేస్తున్నా.. రైతుల ఆత్మహత్యల్లో రెండు తెలుగు రాష్ట్రాలు టాప్ ఫైవ్ లో నిలవటం దేనికి నిదర్శనం?

తాజాగా జాతీయ నేర రికార్డులసంస్థ ఒక నివేదికను వెల్లడించింది. దీని ప్రకారం 2019లో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు దారుణ రికార్డును నమోదు చేశాయి. దీని ప్రకారం తొలిస్థానంలో మహారాష్ట్ర నిలిస్తే.. రెండో రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్.. నాలుగో స్థానంలో మధ్య ప్రదేశ్ నిలిచింది. ఇక.. ఐదో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవటం గమనార్హం.

యాడ్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2019 నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 10,281 మంది రైతులు ఏడాదిలో మరణిస్తే.. మొదటిస్థానంలో నిలిచిన మహారాష్ట్రలో 3927 మంది మరణించారు. కర్ణాటకలో 1992 మంది.. ఏపీలో 1029మంది.. మధ్యప్రదేశ్ లో 541.. తెలంగాణలో 499 మంది మరణించారు. ఆత్మహత్యల్లో జాతీయ సగటు 10.4 శాతం ఉంటే.. తెలంగాణలో మాత్రం 20.6 శాతంగా ఉంది.

ఆత్మహత్యల విషయానికి వస్తే తెలంగాణలో గత ఏడాది మొత్తం 7675 మంది సూసైడ్ చేసుకున్నారు. వారిలో పురుషులు 5612 మంది కాగా.. మహిళలు 2062 మంది. వీరిలో రోజువారీ కూలీలే ఎక్కువ. ఆత్మహత్య చేసుకున్న వారి ఆదాయం లక్ష లోపు వారు ఏకంగా 4353 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. సూసైడ్ చేసుకున్న వారిలో చదువుకోని వారే అధికంగా ఉండటం గమనార్హం. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 30-45 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 4055 మంది మరణించారు. 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు 3076 మంది ఉండటం గమనార్హం.

Next Story
Share it