మూడు రాజధానుల కాన్సెప్ట్ తో మేలేమిటి ?

By Newsmeter.Network  Published on  20 Dec 2019 10:36 AM GMT
మూడు రాజధానుల కాన్సెప్ట్ తో మేలేమిటి ?

ముఖ్యాంశాలు

  • మూడు రాజధానుల వల్ల ముప్పేకానీ తిప్పలు తప్పవు
  • అసలు ఈ మూడు రాజధానుల ఆలోచనే సరైంది కాదు
  • దక్షిణాఫ్రికా నేపధ్యం వేరు నవ్యాంధ్రప్రదేశ్ నేపధ్యం వేరు
  • ఆర్థిక వనరులను అన్ని ప్రాంతాలకూ సమానంగా ఇవ్వాలి
  • అప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది

హైదరాబాద్ : ఏపీకి మూడు రాజధానుల కాన్సెప్ట్ గురించి సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయగానే తెలుగు నేలమీద రాజకీయ వర్గాల నుంచి, సామాన్యుల నుంచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లనుంచి అనేక రకాలైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సౌత్ ఆఫ్రికా తరహాలో ముచ్చటగా మూడు రాజధానుల నమూనాను స్వీకరిస్తే రాష్ట్రం త్వరగా అభివృద్ధిపథంలో పయనిస్తుందనీ, సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందనీ ఏపీ సీఎం భావిస్తున్నారు.

అమరావతిని లెజిస్టేటివ్ క్యాపిటల్ కు పరిమితం చేసి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జుడిషియరీ క్యాపిటల్ ఏర్పాటుచేయాలన్న తలంపును ముఖ్యమంత్రి వీకేంద్రీకరణ పాలసీగా అభివర్ణించిన మరు క్షణంలోనే నవ్యాంధ్రప్రదేశ్ లో తారా స్థాయిలో ప్రకంపనలు మొదలయ్యాయి.

రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటినుంచీ వ్యతిరేకంగానే ఉన్నారు. అమరావతి శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైనప్పటికీ నాటి ప్రథాన ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ మాత్రం హాజరు కాలేదు. రాజధాని నిర్మాణంకోసం రైతులనుంచి భారీగా భూముల్ని సేకరించడాన్ని ఆయన ఆనాడే వ్యతిరేకించారు.

బడ్డెట్ లో రూ.500 కోట్ల నిధుల్ని

అమరావతికి సంబంధించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోకూడా జగన్ ప్రత్యేకంగా ఏమీ హామీలు ఇవ్వలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాని గురించి ప్రత్యేక శ్రద్ధేం లేదు. రాజదాని నిర్మాణంకోసం మొదటి బడ్డెట్ లో రూ.500 కోట్ల నిధుల్ని కేటాయించారు. గత ప్రభుత్వం చేపట్టిన కొత్త రాజధాని నిర్మాణంలో అనేక అవకతవకలున్నాయని బడ్జెట్ ప్రసంగంలోకూడా ప్రస్తావించింది కొత్త ప్రభుత్వం.

అధికారాన్ని చేపట్టినదగ్గరినుంచీ కొత్త ప్రభుత్వం అమరావతి భవితవ్యంపై గందరగోళం నెలకొనే రీతిలో మంత్రులు, వైసీపీ నేతలూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. చివరికి పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలను నీరుగార్చే రీతిలో కొత్త నిర్ణయాలు తీసుకోవడంలోకూడా కొత్త ప్రభుత్వం వెనకాడలేదు.

ఇప్పుడు కొత్తగా మూడు రాజధానులవల్ల ఏపీలో అభివృద్ధి బాగా జరుగుతుందని చెబుతున్నారు. వికేంద్రీకరణ అంటే అధికారిక కార్యకలాపాలను విస్తరించడం మాత్రమే. నేరుగా మూడు చోట్ల మూడు రాజధానులను ఏర్పాటు చేయడం కాదు.

అభివృద్ధి సాధ్యం కాదు

కచ్చితంగా అధికార వికేంద్రీకరణ అభివృద్ధికి దోహదపడి తీరుతుంది. అయితే వివిధ ప్రభుత్వ కార్యకలాపాలను, అధికారులను మాత్రం మరో చోటికి మారిస్తే సరిపోతుందితప్ప రాజధానిని మార్చడం సబబుకాదు. నిధుల్ని పలు ప్రాంతాలకు తరలించడంవల్ల ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. కానీ కొత్త ప్రభుత్వం.. ప్రభుత్వంలో మూడు ముఖ్యమైన అంగాలైన పరిపాలన, చట్టసభలు, న్యాయవ్యవస్థలను మూడు ప్రాంతాలకు తరలించడంవల్ల గందరగోళం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. దానివల్ల అభివృద్ధి సాధ్యంకాదు.

అమరావతికీ విశాఖపట్నానికీ మధ్య దూరం 387 కిలోమీటర్లు. అమరావతికీ కర్నూలుకూ మధ్య దూరం 310 కిలోమీటర్లు. అదే విధంగా విశాఖపట్నానికీ కర్నూలుకూ మధ్య దూరం దాదాపుగా 690 కిలోమీటర్లు. ఆధునిక యుగంలో టెక్నాలజీ సాయంతో ఈ దూరాన్ని అధిగమించడం అసాధ్యమేమీ కాదు. కానీ దీనికి హెచ్చుస్థాయి పరిజ్ఞానం కావాలి. ఇతరత్రా ఇబ్బందులు చాలా ఉంటాయి.

చట్టపరంగా ప్రభుత్వంలో ప్రధానమైన మూడు అంగాలైన ఈ మూడు వ్యవస్థలూ మూడు వేర్వేరు చోట్ల ఉండడంవల్ల అసలే నిధులలేమితో అవస్థలు పడుతున్న రాష్ట్రంపై మరింత భారం పడుతుంది. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా పరిస్థితి తయారవుతుంది.

అమరావతిలో రాజధాని నిర్మాణం ప్లాన్

ఉన్నపళంగా అమరావతిలో రాజధాని నిర్మాణం ప్లాన్ ని పక్కనపెట్టి కొత్తగా ఆలోచించిన మూడు రాజధానుల నిర్మాణం ప్లాన్ ని అమలు చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. దానికితోడు మానవవనరులను ఆ ప్రాంతాలకు తరలించడానికయ్యే ఖర్చుకూడా చాలా ఎక్కవుగా, భరించలేనంతగా ఉంటుంది.

నవ్యాంధ్ర లాంటి కొత్త రాష్ట్రానికి దక్షిణాఫ్రికా తరహా విధానాన్ని అవలంబించాలనుకోవడం పూర్తిగా అసంబద్ధమే అవుతుంది. సౌతాఫ్రికాలో ఉన్న సామాజికపరమైన, సాంస్కృతిక పరమైన నేపధ్యాల వల్ల అక్కడ వాళ్లు ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది అప్పట్లో. 2016లో ఆ దేశాధ్యక్షుడు జాకోబ్ జుమా మాట్లాడుతూ మూడుచోట్ల మూడు రాజధానులు ఉండడంవల్ల పరిపాలన ఇబ్బందిగా ఉందని చెప్పారుకూడా. ఒకే రాజధానివల్ల చాలా లాభాలుంటాయని ఆయన ఆ దేశ ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నమూ చేశారు.

భారత దేశం లాంటి ప్రజాస్వామిక గణతంత్ర దేశంలో ప్రభుత్వంలో అతి ముఖ్యమైన ప్రధానమైన మూడు వ్యవస్థలూ ఒకే చోట ఉండడం చాలా అవసరం కూడా. లేకపోతే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజలకూ అధికారులకూ మధ్య ప్రతి చిన్న విషయానికీ జోక్యం చేసుకునే పరిస్థితి తలెత్తుతుంది.

విధి నిర్వహణకు తీవ్రస్థాయిలో ఆటంకం

నిజానికి ప్రభుత్వ అధికారులు చాలా సందర్భాల్లో కోర్టులకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. తమ విధుల్ని తాము సక్రమంగా నిర్వర్తిస్తూనే అదనంగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికూడా వాళ్లకు ఉంటుంది. అలాంటి సందర్భంలో కేవలం కోర్టుకు హాజరుకావడానికి ఒకచోటినుంచి ఇంకోచోటికి వాళ్లు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే విధినిర్వహణకు తీవ్రస్థాయిలో ఆటంకం కలుగుతుంది. పైగా బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా.

దీనివల్ల ప్రభుత్వ ధనం, అధికారులు, ప్రభుత్వ ప్రతినిధుల కాలం కూడా పెద్ద ఎత్తున వృథా అవుతుందని చెప్పొచ్చు. కేవలం రాజకీయ పరమైన కారణాల వల్ల మూడు చోట్ల మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకోవడం దీన్నిబట్టి చూస్తే పొరపాటు నిర్ణయమే అవుతుందని చెప్పొచ్చు.

ప్రస్తుతం నవ్యాంధ్ర ఉన్న పరిస్థితిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, దక్షిణాఫ్రికాలో స్థితిగతులను సమూలంగా అధ్యయనం చేయకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయంగా దీన్ని అభివర్ణించొచ్చు. 1910లో సౌతాఫ్రికా రాజధానిని నిర్ణయించాల్సి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ప్రాంతాలవారీగా అందరికీ కలుపుకుని పోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అక్కడ వాళ్లు ఆ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఆనాడు ఎదురయ్యింది.

ప్రిటోరియా చాలా కాలంనుంచి ఫారిన్ ఎంబసీలు, ప్రభుత్వ కార్యాలయాలకు వేదికగా ఉంది. కేప్ టౌన్ తొలినుంచీ పార్లమెంట్ కు వేదికయ్యింది. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు అలాంటి అత్యంత పురాతనమైన సామాజిక, సాంస్కృతిక నేపధ్యాల బరువుబాధ్యతలేవీ పీకలమీద లేవు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకోవడానికి, దక్షిణాఫ్రికాను నమూనాగా స్వీకరించడానికి.

రాజధాని ఏర్పాటుకి స్థితిగతులు, పరిస్థితులను పరిగణనలోకి

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ రాజధానిని ఏర్పాటు చేయడానికి అక్కడి స్థితిగతులు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది. నైజీరియా రాజధానిని భౌగోళికంగా ఆ దేశం మధ్యలో ఉన్న అబూజాకి 1991లో మార్చేశారు. దీనికి కారణం జాతులపరంగా మతాల పరంగా విడివిడిగా ఉన్న మనసులను, మనుషులను కలపడానికే ఆ పనిచేశారు.

1961లో బ్రెజిల్ తన రాజధానిని జనసమర్థం ఉన్న తీర ప్రాంత నగరమైన రియోనుంచి అందరికీ అందుబాటులో ఉండే బ్రెజిలియాకు మార్చారు. దేశంలో అన్ని ప్రాంతాలకూ సమానమైన న్యాయం జరగాలని, సమానంగా అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలన్నదే అలా చేయడం వెనక ఉన్న ఉద్దేశం.

అలా వివిధ దేశాల్లో అక్కడి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాస్కృతిక నేపధ్యాలనుబట్టి, అప్పటి పరిస్థితులనుబట్టి, అభివృద్ధికి బాటలు వేసుకోవడానికి వేసుకున్న వ్యూహాలను బట్టి రాజధానులను ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ అవి కాస్తోకూస్తో దూరంలో ఉన్నట్టైతే వాటిని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండే నగరాలకు మార్చుకున్నారు.

కానీ మన నవ్యాంధ్రకు అలాంటి ఇబ్బందికరమైన, తప్పనిసరిగా కీలకమైన నిర్ణయంగా భావించి మూడు రాజధానులను ఏర్పాటు చేయాల్సిన బలవత్తరమైన కారణాలంటూ ఏవీ లేవు. కేవలం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చాలన్న ఆలోచనతో, ఒక పార్టీవారికో, ఒక సామాజిక వర్గం వారికో పూర్తిగా మేలు కలుగుతుందన్న భావనతోనే ఈ సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది, అందరికీ అనిపిస్తోంది.

అలా ముఖ్యమంత్రి తన మనసులో మాటను బైటపెట్టారో లేదో ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో దానిమీద పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించినట్టుగా కనిపిస్తోంది. గత ప్రభుత్వం అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడానికి గల కారణం సేకరించిన భూములను అమ్ముకోవడంవల్ల వాళ్లకు లాభం కలగడమేనని ఈ ప్రభుత్వానికి గట్టిగా అనిపిస్తోందనొచ్చేమో.

చంద్రబాబు బినామీలకే చెందుతుందని

దాదాపుగా నాలుగు వేల ఎకరాల పైచిలుకు భూములు పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికీ, ఆయనకు చాలా దగ్గరైనవారికీ, పార్టీ వర్గాలకూ, వారికి సంబంధించిన వారికీ ధారాదత్తమవుతాయన్న వాదనను ఈ ప్రభుత్వం చాలా బలంగా వినిపిస్తోంది. ఈ భూమంతా పూర్తిగా చంద్రబాబు బినామీలకే చెందుతుందని ఈ ప్రభుత్వంలోని పెద్దలు గట్టిగా వాదిస్తున్నారుకూడా.

ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ పరమైన అంశాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఇలా మొత్తంగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలను ఇరకాటంలో పెట్టడం మంచిపనికాదు, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు.

కృష్ణా తీరంలో నేల గట్టిగా లేకపోవడంవల్ల అక్కడ రాజధానిని నిర్మిస్తే దీర్ఘకాలంలో చాలా నష్టాలు ఎదురవుతాయని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అంటున్నారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖమంత్రికూడా ఇదే విధంగా మాట్లాడారు. అసలక్కడ రాజధానిని నిర్మించాలన్న ఆలోచన వచ్చినప్పుడే ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అయ్యాయి. ఇవ్వాళ్లేం కొత్తగా వచ్చినవి కావవి.

పూర్వ టిడిపి ప్రభుత్వం ఇలాంటి కారణాలన్నింటినీ, అనుమానాలన్నింటినీ అమరావతి మాస్టర్ ప్లాన్ తో తుడిచిపెట్టింది. నిజంగా ఇప్పటి ప్రభుత్వానికి నదీ తీరంలో రాజధానిని నిర్మించడంవల్ల భవిష్యత్తులో అనేక విధాలైన ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచనే బలంగా ఉంటే దానికి అనుగుణంగా కావాల్సిన మార్పులు చేర్పులు ఇష్టం వచ్చిన రీతిలో చేసుకోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం అలా చేయడంలేదు.

రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందదు

ఒకేచోట అన్ని వ్యవస్థలూ ఉంటే పూర్తి స్థాయిలో ఒక్కచోటే అభివృద్ధి జరుగుతుంది తప్ప రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందదు అన్న ఒకే కారణాన్ని పదే పదే చెబుతోందీ ప్రభుత్వం. అందుకే ముచ్చటగా మూడు రాజధానుల మంత్రాన్ని జపిస్తున్నామంటూ నమ్మబలుకుతోంది.

ఒకవేళ కర్నూలు జుడిషియరీ రాజధాని అయితే ఎప్పటినుంచో హైకోర్ట్ అక్కడ పెట్టాలని జరుగుతున్న ఆందోళనలకు, చేస్తున్న ఒత్తిడికి కాస్తైనా న్యాయం చేసినట్టు అవుతుందేమో. 1937లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నేతలమధ్య జరిగిన శ్రీబాగ్ ఒప్పందంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే రాజధానిని లేకపోతే కనీసం హైకోర్టునైనా కర్నూలులో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ అప్పట్లోనే బలంగా వినిపించింది.

కర్నూలు నగరం 1953 నుంచి 1956 వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉంది. నిజానికి ప్రభుత్వంలో మూడు ప్రధాన అంగాలైన లెజిస్లేచర్, జుడిషియరీ, అడ్మినిస్ట్రేషన్ అనే మూడూ ఒకే చోట ఉండడమే ఎప్పటికైనా మంచిదని చెప్పొచ్చు.

కానీ కొన్ని చారిత్రక కారణాలను సాకుగా తీసుకుని వీటిని విడివిడిగా మూడుచోట్ల ఏర్పాటు చేయడంవల్ల సామాన్యులకు దానివల్ల పెద్దగా ఒరిగే లాభం ఏమీ ఉండకపోవచ్చు. అదేమంత గొప్ప ఆలోచనగా పరిగణింపబడదనే చెప్పాలి. పైగా అలా చేయడంవల్ల ప్రజలకు కొంతమేరకు అసౌకర్యం, నష్టం కూడా వాటిల్లే ప్రమాదమూ ఉంటుంది. దీనికి బదులుగా ఇప్పుడు ప్రభుత్వం ఆర్థిక వనరులను కోస్తాకు, రాయలసీమకు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నింటికీ సమానంగా పంచి సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనిచేయడమే మంచిది.

Next Story
Share it