ముచ్చటగా మూడు రాజధానులా...ముప్పేటగా మూడు దాడులా?
By రాణి
ముఖ్యాంశాలు
- జగన్ పాశుపతాస్ర్తంలో చంద్రబాబు ఇరుక్కున్నారా ?
- మూడు రాజధానుల వల్ల బాబుకొచ్చిన నష్టం ఏంటి ?
వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి, కాసేపు మాట్లాడిన వారంతా ఆయనది చాలా చురుకైన బుర్ర అని ఒప్పుకుని తీరతారు. ఆయన చాలా నిశిత దృష్టితో చూస్తారు. చాలా శ్రద్ధగా వింటారు. అడగాల్సిన మూడు నాలుగు ప్రశ్నలు అడుగుతారు. ఆ తరువాత నిర్ణయం మాత్రం తన విచక్షణ ఆధారంగానే తీసుకుంటారు.
ఇప్పుడు ఉన్నట్టుండి మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తేవడం వెనుక కూడా ఇదే సునిశిత పరిశీలిన, సుదృఢ వ్యూహరచన, చదరంగపుటెత్తుగడలు ఉన్నాయన్నది సులువుగానే అర్థమౌతాయి. జగన్ ప్రధాన లక్ష్యం చంద్రబాబుకు చెక్ పెట్టడటమే. ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చాక చంద్రబాబు పరిస్థితి “ముందు నుయ్యి వెనక గొయ్యి.” మూడు రాజధానుల ప్రతిపాదనను ఒప్పుకుంటే రెండు సమస్యలు. అమరావతి లో తన అనుచరుల భూ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయి. రెండోది అసలు ఆయన ఇన్నాళ్లూ ఈ మూడు రాజధానుల ఆలోచన ఎందుకు చేయలేదు?
ఒకవేళ ఈ ప్రతిపాదనలను ఆయన వ్యతిరేకిస్తే అటు రాయలసీమ ప్రజలు, ఇటు ఉత్తరాంధ్ర జనం ఆయనకు దూరమౌతారు. పార్టీ నాయకులు కూడా ఇదే సాకు చూపి, గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. పోనీ సమర్థిస్తే ఆయనకు తన పార్టీకి వెన్నెముకగా ఉన్న ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరులు అలక పానుపెక్కుతాయి. దీంతో ఆయన పరిస్థితి “కరవమంటే కప్పకు కోపం....విడవమంటే పాముకు కోపం” అన్నట్టు అవుతుంది. మొత్తం మీద ఆయనను అడకత్తెరలో పెట్టేశారు జగన్.
నిజానికి వైజాగ్, కర్నూలులు రాజధానులుగా అధికారికంగా ప్రకటించినా, అక్కడ నిర్మాణాలు పూర్తయి, వ్యవస్థలు ఏర్పడి, అంతా సర్దుకోవడానికి పదేళ్లు పడుతుంది. కానీ ఈ మధ్యలో చంద్రబాబు వంద సంజాయిషీలు, వెయ్యి స్పష్టీకరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ప్రతి సారి ఆయన జవాబులు చెప్పుకోవలసి వస్తుంది. పర్యవసానంగా 2024 ఎన్నికల నాటికి చంద్రబాబు డిఫెన్స్ లో, వైకాపా అఫెన్సులో ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పాలనాపరంగా ముందడుగు వేయకపోయినా, రాజకీయంగా ఈ ఇష్యూ రాజుకుంటూనే ఉంటుంది. చంద్రబాబును చికాకుల పాలు చేస్తూనే ఉంటుంది.
మొత్తం మీద పొలిటికల్ గా జగన్ పాశుపతాస్త్రం వేశారు. చంద్రబాబు దీనికి విరుగుడు ఎలా వేస్తారు? జగన్ ఎజెండా ట్రాప్ లో ఇరుక్కుంటారా? లేకపోతే తన కొమ్మ తానే నరుక్కుంటారా? లేక తప్పుల మీద తప్పులు చేస్తూ వెనకబడి పోతారా? ఈ రాజధాని వివాదం అంత త్వరగా తేలే వ్యవహారం కాదు. ఎంత సాగదీస్తే జగన్ కి అంత లాభం. జగన్ కి చెలగాటం, చంద్రబాబుకి ప్రాణసంకటం!! కాదంటారా?