మానవత్వాన్ని చంపేస్తోన్న కరోనా..

By సుభాష్  Published on  21 July 2020 7:02 AM GMT
మానవత్వాన్ని చంపేస్తోన్న కరోనా..

ముఖ్యాంశాలు

  • వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి

  • రోడ్డుపైనే కుప్పకూలిన వృద్ధుడు

  • కరువైన మానవత్వం

చైనా నుంచి సుమారు 150 దేశాలకు పాకిన కరోనా ఇప్పుడు బీభత్సం సృష్టిస్తోంది. పుట్టినిల్లైన చైనాలో ఒక్కకేసు కూడా నమోదు కావడం లేదు కానీ..ప్రపంచ దేశాల్లో మాత్రం రోజురోజుకూ వైరస్ వ్యాప్తి తీవ్రత ఊహకి కూడా అందనంతగా పెరిగిపోతోంది. కేవలం ఆదివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే..లెక్కకు రాని కేసులు, మృతులు ఇంకా ఎన్ని ఉన్నాయోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే వారంరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మానవత్వం నశించిందేమోనన్నట్లుగా కనిపిస్తోంది. టీవీ ఆన్ చేసి వార్తా ఛానల్ పెడితే చాలు. నంద్యాలలో దారుణం, జనగామలో వైద్యుల నిర్లక్ష్యం, నల్గొండలో తల్లి రోదన, గుంటూరులో కనిపించని మానవత్వం అంటూ వార్తలు దర్శనమిస్తున్నాయి.

నిజంగానే కరోనా కారణంలో సమాజంలో మానవత్వం నశిస్తోందా? అన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది కానీ..మనం ఏం చేస్తున్నాం ? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవడం లేదు. జులై 20 ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూస్తే ఎంత కఠిన మనస్కులైనా చలించిపోవాల్సిందే. ఆదివారం తెలంగాణలోని నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో ఒక యువకుడు శ్వాస ఆడక తల్లి కళ్లముందే కన్నుమూశాడు. అక్కడికీ కొడుకును రక్షించుకునేందుకు ఆ తల్లి అన్ని విధాలా ప్రయత్నించింది. మంచినీరు ఇచ్చి, వైద్యులచేత ఆక్సిజన్ పెట్టించినా ఫలితం దక్కలేదు. శ్వాస ఆడక కొట్టుకుంటూనే కన్నుమూశాడు. కొడుకు మృతదేహంపై పడి తల్లి రోధిస్తున్న తీరు చూపరులచేత కంటతడి పెట్టించింది. కరోనాతో ఆస్పత్రిలో చేరిన యువకుడికి సుమారు 4 గంటల సేపు ఎవరూ వైద్యం అందించకపోవడంతో యువకుడు మృతి చెందాడన్న విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్ కు నోటీసులు పంపింది. ఆగస్టు 21వ తేదీ లోపు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోనూ కరోనా బాధితుడి పట్ల ఇరుగు పొరుగు వారే కాదు.. సొంత బంధువులు కూడా కనికరం చూపలేదు. సత్తెనపల్లి వావిలాల వారి వీధిలో 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి వ్యాపారం చేస్తుంటాడు. ఆదివారం ఉదయం అతడికి కరోనా సోకినట్లు నిర్థారణయింది. దీంతో కాస్త ఆందోళనకు గురైన అతను మధ్యాహ్నానికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అంబులెన్స్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాకపోవడంతో ఇంటి నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కుతుండగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో ఆటో అతను భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆయనకు ఇద్దరు కూతుర్లుండగా..తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సహాయం చేయాలని ఇరుగు పొరుగువారిని కోరినా ఎవరూ స్పందించలేదు. సుమారు నాలుగు గంటల సేపు వ్యక్తి మృతదేహం రోడ్డుపైనే ఉండటంతో ఎవరో ఫోన్ చేయగా మునిసిపల్ సిబ్బంది వచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు.

ఇలా వెలుగులోకి వచ్చిన ఘటనలు నాలుగైదు ఉండగా..మీడియా దృష్టికి రాని సంఘటనలెన్నో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కరోనా రోగుల పట్ల వైద్యులు, సమాజం మానవత్వ దృక్పథంతో ఉండాలని ఎందరు ఎంత చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

Next Story