ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనపై ముందుగానే అటు ప్రధాని మోదీకి, ఇటు అమిత్ భాయి షా కి సూచనలు ఇచ్చేశారు. ఆయన వారికి తాను మూడు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పడమే కాక వారి అంగీకారాన్ని కూడా తీసుకున్నారని ఇప్పుడు లోగుట్లు తెలుస్తోంది. వారిద్దరికీ ముందస్తు సూచనలు ఇచ్చిన కారణంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్ ప్రతిపాదనల పట్ల ఎలాంటి వ్యతిరేకత రాలేదు. శాసనసభా పరమైన రాజధానిని అమరావతిలో ఉంచి, జ్యుడీషియల్ రాజధాని కర్నూలులో, పాలనాపరమైన రాజధాని విశాఖపట్నంలో ఉంచాలని.. జగన్ ప్రతిపాదిస్తున్నారు.

ముందస్తుగా సూచన ఉన్న కారణంగానే బిజెపి మధ్యేమార్గంగా స్పందిస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ విషయంలో శివరామకృష్ణన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కు గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటే పంట పొలాల్లో రాజధాని నిర్మాణం వద్దని స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా అమరావతి వరద ముంపుకు గురయ్యే ప్రాంతమని, అక్కడ రాజధాని వద్దని కమిటీ నిర్ద్వంద్వంగా సూచించింది. అయితే ఈ విషయాలన్నిటినీ చాపకిందకు తోసేసి చంద్రబాబు తన “నిపుణుడు” మాజీ మంత్రి నారాయణ మాటనే తీసుకున్నారు. రాజధానికి అమరావతిలోనే పెట్టారు.

జగన్ ప్రతిపాదనలు వెలువడ్డ తరువాత బిజెపి రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో స్పందించిన తీరు ఈ సందర్భంగా గమనార్హం. ఆయన అమరావతిని ఇప్పటి వరకూ రాజధానిగా చంద్రబాబు నోటిఫై చేయలేదని కూడా ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నోటిఫై చేస్తే అదే రాజధాని అవుతుందని ఆయన చెప్పడం గమనార్హం. కాబట్టి బిజెపికి ముందస్తుగా విషయం తెలిసిన కారణంగానే ఈ విధంగా స్పందించిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. మొత్తం మీద మోదీ, షాలకు ముందస్తుగా తెలియచేయడం వల్ల జగన్ గట్టిపునాదుల మీదే తన ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమౌతోంది. పాపం … చంద్రబాబుకు ఇంకా ఈ విషయం అర్థమైనట్టు లేదు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.