భారీ వర్ష ముప్పు.. ఐదు జిల్లాల్లో హై అలర్ట్
By సుభాష్ Published on 16 Aug 2020 7:01 AM ISTఏపీలో అల్పపీడన ద్రోణీ కొనసాగుతోంది. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉందని రాష్ట్ర విపత్తుశాఖ పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు
సూచించారు. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
సముద్రంలో 3.5 నుంచి 4.3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు
సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ,
తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆదివారం తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, రాష్ట్రంలో ఇతర
జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక సోమవారం విశాఖ, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అలాగే మంగళవారం విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మోస్తలు వర్షాలు కురుస్తాయని, ఇతర ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రెస్క్యూటీమ్, అధికారులను అప్రమత్తం చేసింది.