రూ.కోటి అడ్వాన్స్ ఇచ్చేసిన సీఎం జగన్.. ఇంతకీ ఎవరీ ముఖుల్ రోహిత్గి..!
By సుభాష్
మూడు రాజధానుల ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకునేందుకు ఇప్పటికే టీడీపీ చురుగ్గా పావులు కదుపుతోంది. న్యాయ స్థానాల్లోనూ పలు కేసులు వేయిస్తోంది.
ఇప్పటికే మూడు రాజధానులపై హైకోర్టులో భారీగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను బుధవారం హైకోర్టు విచారించింది. అయితే, రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఇంకా శాసన మండలిలో చర్చ జరుగుతోందని బుధవారం హైకోర్టు దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో విచారణను గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది.
ఎలాగైనా కోర్టుల ద్వారా మూడు రాజధానుల ప్రక్రియను అడ్డుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా న్యాయ వాదులను కూడా రప్పిస్తోంది. పై చేయి సాధించేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. టీడీపీ చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు గాను కేంద్ర ప్రభుత్వ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గిని ఏపీ ప్రభుత్వం నియమించింది.
దేశంలోనే ప్రముఖ న్యాయవాది అయిన ముఖుల్ రోహత్గి ఫీజు కూడా భారీగానే తీసుకుంటారు. ఏపీ ప్రభుత్వం తరుపున రాజధాని కేసులను వాదించినందుకుగాను ఆయనకు ఏపీ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు చెల్లించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అడ్వాన్స్ కింద ఆయనకు కోటి రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజధాని ప్రాంతంలో సెక్షన్ 144 విధింపు, మూడు రాజధానుల నిర్ణయం సీర్డీఏ చట్టం రద్దు తదితర అంశాలపై ఏపీ ప్రభుత్వం తరుపున ముఖుల్ రోహత్గి వాదిస్తారు.