రాళ్లదాడి విషయంలో వైసీపీ, పోలీసులు కుమ్మక్కైయ్యారు
By Newsmeter.Network
వైసీపీ మంత్రులు, డీజీపీ వ్యాఖ్యలపై టీడీపీనేత, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా బస్సు యాత్రపై జరిగిన రాళ్లదాడి నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. రాళ్ల దాడి విషయంలో వైసీపీ, పోలీసులు కుమ్మక్కైయ్యారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో టీడీపీ చేసిన అభివృద్ధి చూడడానికి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. అధికార పార్టీ వైసీపీ కార్యకర్తలను రాళ్లు, చెప్పులు వేసేలా పురమాయించడం మరీ దారుణమని అన్నారు. ఇందుకు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రధాని ప్రతిపక్షం కార్యక్రమాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే చేటని, దానిని సమర్థిస్తూ డీజీపీ, మంత్రుల ప్రకటన హేయమన్నారు. పోలీసులు, మంత్రులు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చా..?, వారిపై ఐపీసీ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదని యనమల ప్రశ్నించారు. వైసీపీ తప్పుడు పనుల్లో డీజీపీ భాగస్వామ్యం కావడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 80 శాతం భవనాలను చూపించామని, టీడీపీ చేసిన అభివృద్ధికి ఏం సమాధానం చెబుతారన్నారు.
రాష్ట్ర రాజధానిపై సీఎం జగన్‌కు అవగాహన లేదని, రాజధాని ఎక్కడ ఉంచుతారో, తీసేస్తారో చెప్పరని అన్నారు. ఒక ఇల్లు కట్టుకోవడానికి మంత్రులు బుగ్గన, బోత్స సత్యనారాయణకు రెండేళ్లు పట్టిందని, సీఎం జగన్ ఇల్లు కట్టడానికి రెండేళ్లు పట్టిందని, అలాంటిది రాజధాని నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందని యనమల ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలపై చంద్రబాబు ఆలోచించారే తప్ప... తన సొంతింటి యావలేదన్నారు. జగన్‌ది స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారని, అదే చంద్రబాబు జనం కోసం రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు.