ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా కనకరాజు
By రాణి
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనకరాజు నియమితులయ్యారు. ఏపీ ఎన్నికల కమిషనర్ గా కనకరాజు నియామకంపై గవర్నర్ ఆమోదం ఇవ్వడంతో ఆయన శనివారం ఉదయం విజయవాడలో బాధ్యతలను స్వీకరించారు. కాగా..శుక్రవారం తుడా సెక్రటరీగా పనిచేస్తున్న రామ సుందర రెడ్డి ఐఏఎస్ ను నియమిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు కనకరాజు బాధ్యతల స్వీకరణతో ఎన్నికల కమిషనర్ నియామకంపై ప్రభుత్వం ఆఖరి వరకూ గోప్యత పాటించినట్లు తెలుస్తోంది.
కాగా..శుక్రవారం ప్రభుత్వం హైడ్రామాతో రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించింది. ఎన్నికల అధికారి నియామకానికి సంబంధించిన సెక్షన్ 200 నిబంధనలను పూర్తిగా మార్చేసి..పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించి పక్కా ప్లాన్ ప్రకారం ప్రభుత్వం రమేష్ కుమార్ ను తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
శుక్రవారం సాయంత్రమే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు గవర్నర్ ఆర్డినెన్స్ కూడా ఇచ్చారు. దీనిపై ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి తీవ్ర దుమారం రేగుతోంది. ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించకుండా కక్షపూరిత రాజకీయాలకు తెరలేపుతోందని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ను తొలగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కె) ప్రకారం రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే హక్కు ఒక్క గవర్నర్ కే ఉందని, ఒకసారి నియామకం జరిగి ఐదేళ్ల పదవీకాలాన్ని నిర్ణయించాక ఆ అధికారిని విధుల నుంచి తప్పించే హక్కు ఒక్క పార్లమెంట్ కు తప్ప మరెవ్వరికీ లేదని టీడీపీ నేత యనమల పేర్కొన్నారు.