తెలుగు రాష్ర్టాల విభజన తర్వాత ఏపీలో ఉన్న జిల్లాలు 13. ఇప్పుడు 13 జిల్లాలను 16 జిల్లాలుగా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏపీలో కొత్తగా ౩ జిల్లాలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా ప్రభుత్వం కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా..ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు కానీ..మచిలీపట్నం, అరకు, గురజాలల్లో రాష్ర్ట ప్రభుత్వం ఇటీవలే మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది.

ఒక మెడికల్ కాలేజీని నిర్మించాలంటేనే రూ.500-600 కోట్ల వరకూ ఖర్చవుతుంది. అయితే...అక్షరాస్యత, వైద్య వసతులు తక్కువగా ఉండి, ఎలాంటి వైద్యకళాశాలలు లేకుండా బాగా వెనుకబడి ఉన్న జిల్లాల్లో రాష్ర్ట ప్రభుత్వం ఈ కళాశాలల్ని ఏర్పాటు చేస్తే అందుకు అయ్యే ఖర్చులో సుమారుగా 60 శాతం వరకూ ఎంసీఐ (Medical Council of India) భరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంసీఐ సహాయం కోసం...తొలి దశలో మచిలీపట్నం, అరకు, గురజాల ప్రాంతాలను జిల్లాలుగా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఈ అంశంపై మంత్రి వర్గ సమావేశంలో కూడా చర్చించి, కేబినెట్ ఆమోదం కూడా పొందినట్లుగా కూడా తెలుస్తోంది.

అలాగే కడపలో టీడీపీ కార్యాలయం కోసం రోడ్లు, భవనాల శాఖకు చెందిన స్థలాన్ని కేటాయిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పుడు ఆ స్థల కేటాయింపును రద్దు చేస్తున్నట్లుగా రాష్ర్ట మంత్రివర్గం నిర్ణయించింది.

రాణి యార్లగడ్డ

Next Story