ముఖ్యాంశాలు

  • కౌన్సిల్ కి మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు
  • పాత రాజధాని అభివృద్ధి బిల్లు రద్దయ్యేనా?
  • కౌన్సిల్ ఆమోదం కోసం ఎదురుచూపులు
  • ఏం చేసైనా సరే బిల్లును పాస్ చేయించాలని పట్టుదల
  • వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ప్రభుత్వం
  • కౌన్సిల్ లో టిడిపిదే బలం, అయినా ప్రభుత్వ ధీమా
  • చీలికలు తెచ్చి బలాన్ని సాధించే ప్రయత్నాలు
  • కౌన్సిల్ చైర్మన్ ఆమోదం లేకపోయినా బిల్ పాస్

ఏపీలో ఇప్పుడు అందరికళ్లూ లెజిస్లేటివ్ కౌన్సిల్ మీదే ఉన్నాయి. అత్యంత కీలకమైన రెండు బిల్లులు ఆమోదం పొందేందుకు కౌన్సిల్ కి రావడమే దానికి కారణం. మొదటిది మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించింది, రెండోది ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీని రద్దు చేసేది. కౌన్సిల్లో మెజారిటీ తెలుగుదేశం పార్టీదే. అందుకే ఇప్పుడు బిల్లు పాస్ అవ్వాలంటే వై.ఎస్.ఆర్.సి.పి ఏదో ఒక చక్రం తిప్పి తీరాల్సిందే.

ఒకవేళ టిడిపికి బిల్లు పూర్తి స్థాయిలో ఉన్నది ఉన్నట్టుగా నచ్చకపోతే తిరిగి దాన్ని మళ్లీ శాసన సభకు మార్పులు చేర్పులకోసం రికమెండ్ చేస్తూ పంపించడంతో సహా వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం అన్నింటికీ సిద్ధపడి ఉంది. వీలైనంతవరకూ టిడిపి ఎమ్మెల్సీల్లో చీలిక తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ఒక వర్గాన్ని తన వైపుకు లాక్కుని, బతిమాలో, బామాలో, మభ్యపెట్టో ఏదో ఒక విధంగా బిల్లను పాస్ చేయించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

చాలామంది టిడిపి ఎమ్మెల్సీలు ఓ స్థాయిని మించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పెట్టుకోవడం మంచిదికాదని, బిల్లుకు సహకరించడమే సబబైన పననీ అధిష్ఠానానికి పూర్తి స్థాయిలో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా వినికిడి. అసలు ఏకంగా కౌన్సిల్ నే రద్దు చేసేందుకు ప్రభుత్వం ఓ కొత్త బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉందన్న ఊహాగానాలు విస్తృత స్థాయిలో ప్రచారం అయ్యాయికానీ నిజానికి అలాటిదేం జరగలేదు. ప్రభుత్వం ఈ రెండు బిల్లుల్నీ పాస్ చేసేందుకు అసెంబ్లీలో మూడు రోజుల బిజినెస్ ని ప్లాన్ చేసింది. కానీ ఒకే రోజుల్లో బిల్లులు సభ ఆమోదాన్ని పొంది కౌన్సిల్ కి వెళ్లిపోయాయి. ఒకవేళ కౌన్సిల్ నుంచి మార్పులు చేర్పులు కోరుతూ బిల్లు వెనక్కొస్తే దానికి సంబంధించిన వ్యవహారాలకోసం ఒక రోజును పూర్తిగా రిజర్వ్ చేసినట్టుగా సమాచారం.

మనీ బిల్లుగా ప్రవేశపెట్టిన ట్రెజరీ బెంచ్ లు

నిజానికి కౌన్సిల్ చైర్మన్ కి ఉన్నపళంగా సభను వాయిదా వేసే అలోచన వస్తే చేయగలిగేది ఏం లేదు. లేదా తీరిగ్గా బోలెడంత సమయం తీసుకుని తర్వాత మెల్లిగా బిల్లును మార్పులు చేర్పులు కోరుతూ అసెంబ్లీకి పంపినా ఎవరూ అడగడానికి లేదు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం మాత్రం బైటికి రావట్లేదు. ప్రభుత్వం తమవాళ్లు ఎవరూ పెదవి కదపకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేసుకుంది. ట్రెజరీ బెంచ్ లు మాత్రం ఈ బిల్లుల్ని మనీ బిల్లులుగా ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ రెగ్యులర్ బిల్లుగా ప్రవేశపెడితే ఇటు అసెంబ్లీ స్పీకర్, అటు కౌన్సిల్ చైర్మన్ ఇద్దరూ బిల్లు డ్రాఫ్ట్ కాపీమీద తమ ఆమోదాన్ని తెలుపుతూ సంతకం చేస్తేనే గానీ గవర్నర్ ఆ బిల్లుల్ని ఆమోదించడానికి లేదు. అదే మనీ బిల్లు అయితే కౌన్సిల్ చైర్మన్ సంతకం పెట్టకపోయినా ఫర్వాలేదు. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పకతప్పదు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.