ఏపీ ఇంటర్‌ బోర్డ్ కీలక నిర్ణయం.. ఇక నుంచి..

By సుభాష్  Published on  29 Jan 2020 10:26 AM GMT
ఏపీ ఇంటర్‌ బోర్డ్ కీలక నిర్ణయం.. ఇక నుంచి..

ఏపీ ఇంటర్‌ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియేట్‌లో ఉన్న గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సంవత్సరం నుంచి గ్రేడింగ్‌ విధానం కాకుండా మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రేడింగ్‌ విధానం ద్వారా విద్యార్థులకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అందుకే గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

గ్రేడింగ్‌ విధానంపై చర్చ

గ్రేడింగ్‌ విధానంలో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది డిసెంబర్‌లో ఇంటర్‌ బోర్డ్ అధికారులు ప్రభుత్వంతో చర్చలు జరిపింది. గ్రేడింగ్‌ విధానంలో తలెత్తుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి వివరించింది. గ్రేడింగ్‌ విధానం స్థానంలో మార్కులే ఇవ్వడం ఉత్తమమని సూచించింది. దీనిపై ప్రభుత్వం కూడా అంగీకరించడంతో గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం తెలిపింది. గ్రేడ్లు ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల్లో ప్రవేశాలు, ఎంసెట్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఇంటర్‌ బోర్డ్ పేర్కొంది.

గ్రేడ్ల విధానం ఎలా వచ్చిందంటే..

ఇంటర్మీడియేట్‌ విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం రెండు సంవత్సరాల క్రితం గ్రేడ్ల విధానం తీసుకువచ్చింది. ఏపీ ఎంసెట్‌ ఇంటర్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. ఇందుకు మార్కులు అవసరం కానున్నాయి. ఇదే కాకుండా తెలంగాణ ఎంసెట్‌కు మార్కులు ఇవ్వాల్సి వస్తోంది. గత ఏడాది ఢిల్లీ విశ్వవిద్యాలయం, కర్ణాటక ఇంజనీరింగ్‌, వైద్య విద్య ప్రవేశాలు, పక్క రాష్ట్రాల్లోని డిమ్డ్‌ వర్సిటీల్లో ప్రవేశాలకు మార్కులు అడుగుతుండటంతో విద్యార్థులకు మార్కులు ఇచ్చారు. ముందుగా మార్కుల జాబితాలో గ్రేడ్‌, గ్రేడింగ్‌ పాయింట్లు ఇచ్చారు. అయితే ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల యాజమాన్యాలు మార్కులు అడుగుతున్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు మార్కుల విధానం అమలు చేయాలని కోరారు. విటన్నీంటిని పరిగణలోకి తీసుకున్న సర్కార్‌ .. గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేసి మార్కుల విధానం అమలు చేయబోతోంది.

Next Story