సీబీఐ చేతికి వివేకా హత్యకేసు

By Newsmeter.Network  Published on  11 March 2020 9:55 AM GMT
సీబీఐ చేతికి వివేకా హత్యకేసు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్మోహన్‌రెడ్డి బాబాయి వై.ఎస్‌. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం తీర్పును వెలువరించింది. హైకోర్టు నిర్ణయం మేరకు త్వరలోనే సీబీఐ ఈ కేసును విచారణ చేయనుంది.

2019 ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్‌ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వివేకా హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కాగా ఈ హత్యపై వైసీపీ, టీడీపీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. జగన్మోహన్‌రెడ్డే వివేకా హత్యకు కారణమంటూ టీడీపీ నేతలు ఆరోపించగా.. కడప జిల్లాలోని టీడీపీ నేతలే వివేకా హత్యకు కారణమంటూ ఆరోపించారు. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని అప్పట్లో వైసీపీ డిమాండ్‌ చేసింది. అప్పటి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ హత్యకేసు విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది. ఎన్నికల అనంతరం వైకాపా అధికారంలోకి రావటంతో ప్రమాణస్వీకారం చేసిన వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి కొత్తగా సిట్‌ను ఏర్పాటు చేశారు.

సిట్‌ అధికారులు పలువురు అనుమానితులతో పాటూ టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలను కూడా విచారణకు పిలిచింది. దీంతో వారిరువురుతో పాటు పలువురు విచారణకు హాజరై తమ వాదనను వినిపించారు. ఇదే సమయంలో వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు జగన్మోహన్‌రెడ్డిసైతం గతంలో వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటీషన్‌ వేసి అధికారంలోకి వచ్చిన తరువాత వెనక్కు తీసుకున్నారు. కాగా వివేకా భార్య, కూతురు, టీడీపీ ఎమ్మెల్సీ రవి, ఆదినారాయణరెడ్డిలు వేసిన పిటీషన్‌లను కలిపి పలుమార్లు ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అప్పటికే వైకాపా ప్రభుత్వం సిట్‌చే దర్యాప్తు చేపిస్తుండగా.. ఈ కేసును సిట్‌ దర్యాప్తు చేస్తుందని, సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని తన వాదనలు వినిపించింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Next Story
Share it