పాఠశాలల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు

By సుభాష్  Published on  6 July 2020 3:53 PM IST
పాఠశాలల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు

ఏపీ విద్యాశాఖ పాఠశాలల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రలోని పాఠశాలల నిర్వహణలో సాంకేతికతను తీసుకువస్తూ పలుమార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలోకరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉన్నందున పని దినాలను కుదించింది విద్యాశాఖ. ఇక పాఠశాలల నిర్వహణపై విద్యాశాఖ పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌ వాడరేవు చినవీరభద్రుడు వివరాలు వెల్లడించారు.

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు వారానికి ఒక రోజు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు వారానికి రెండు రోజులు పని చేసేలా విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ చేసింది.

బ్రిడ్జి కోర్సు ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో టచ్‌లో ఉండే విధంగా ప్రణాళిక సిద్దం చేసినట్లు విద్యాశాఖ తెలిపింది.

జూలై 10వ తేదీలోపు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్లస్‌డేటాను రిజిస్టర్‌లో అప్‌ డేట్‌ చేయాల్సిందిగా సూచించింది. నాడు-నేడు మొదటి ఫేజ్‌లో పాల్గొంటున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

ప్రధానోపాధ్యాయులకు నాడు-నేడులో జరిగే 9 పనులను ఉపాధ్యాయులకు పంపిణీ చేయాల్సిందిగా నిర్ణయం తీసుకుంది. జూలై 31లోగా ఈ పనులన్నీ పూర్తయ్యేలా ఉపాధ్యాయులు మానిటరింగ్‌ చేసే బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది. నాడు-నేడు పనుల నుంచి కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు, కంటిచూపులో లోపాలు, దివ్యాంగులైన ఉపాధ్యాయులకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.

విద్యా సంవత్సరం ప్రణాళిక ఆధారంగా..

కాగా, విద్యాశాఖ ప్రణాళిక ఆధారంగా బ్రిడ్జి కోర్సులు, హైటెక్‌, నోటెక్‌, వ్యూహాలను పాఠశాలలు తెరుచుకునేలోపు సిద్ధం చేయాలన్నారు. అలాగే ప్రతి వారం ఈ బ్రిడ్జి కోర్సు ద్వారా ఇచ్చిన మెటీరియల్‌ను విద్యార్థులు అనుసరిస్తున్నారా ..? లేదా..? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాల హైస్కూల్‌కు సంబంధించిన బ్రిడ్జికోర్సు మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో, ఆఫ్‌ లైన్‌లో సిద్ధం చేయాలన్నారు. వీలైనంత త్వరగా వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.

Next Story