ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఏపీ ప్రభుత్వం ఉద్వాసన

By Newsmeter.Network  Published on  10 April 2020 12:26 PM GMT
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఏపీ ప్రభుత్వం ఉద్వాసన

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఏపీలోనూ విజృంభిస్తోంది. ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మహమ్మారి వైరస్‌ను కట్టడి చేసేందుకు శ్రమిస్తోంది. ఇదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో ఏపీ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల మార్చి చివరిలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ వాయిదా వేశారు. దీంతో రమేష్‌కుమార్‌కు ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం రాజుకుంది. అప్పటి నుంచి రమేష్‌కుమార్‌ తీరుపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి గుర్రుగా ఉన్నారు.

Also Read :మాస్కుల తయారీ ఇలా – కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

దీంతో సమాచారం బయటకు పొక్కకుండానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకం నిబంధనలను మార్పు చేస్తూ గవర్నర్‌కు ప్రభుత్వం ఆర్దినెన్స్‌ పంపించింది. ఏపీ ప్రభుత్వం పంపించిన ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌లో పేర్కొంది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం లభించడంతో తాజా నిబంధనల ప్రకారం రమేష్‌కుమార్‌ పదవీకాలం ముగిసింది. దీంతో ఆయన్ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఇందుకు సంబంధించి మూడు జీవోలను ప్రభుత్వం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రెండు పంచాయతీరాజ్‌ శాఖ నుంచి, ఒకటి న్యాయ శాఖ నుంచి జీవోలను తెచ్చినట్లు సమాచారం. వీటిని ప్రభుత్వం గోప్యంగా ఉంచడం గమనార్హం.

అసలేం జరిగిందంటే..

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికలు ఒకే సారి నిర్వహించేందుకు నిర్ణయించడంతో మార్చి చివరివారంలో అన్ని ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా నామినేషన్‌ల సమయంలో ఏపీలోని పలు గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో వైకాపా నేతలు తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయటం లేదని ఏపీ ఎన్నికల కమిషనర్‌కు, కేంద్రానికి టీడీపీ, బీజేపీలు ఫిర్యాదు చేశాయి. అప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. చైనాలో అప్పటికే వేలాది మంది మృత్యువాత పడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయింది. వెంటనే దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఎన్నికలను ఆ రాష్ట్రాల ఎన్నికల కమిషన్‌లు వాయిదా వేశారు.

Also Read : దేశీయ అవసరాలే.. మా తొలి ప్రాధాన్యం

ఏపీలో ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడ్డింది. రమేష్‌ కుమార్‌ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే సీఎం జగన్‌ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాలో సమావేశంలో రమేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, రమేష్‌ది ఒకే సామాజిక వర్గం అని అందుకే చంద్రబాబు చెప్పినట్లు ఎన్నికలను వాయిదా వేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. మరుసటిరోజు ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ ఏపీ గవర్నర్‌ను కలిసి ఎన్నికల వాయిదాకు గల కారణాలను వివరించారు. కరోనా వైరస్‌ ఉదృతి పెరుగుతుందని ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలిపారు. రమేష్‌ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకం నిబంధనలను మార్పు చేస్తూ గవర్నర్‌కు ఆర్దినెన్స్‌ పంపించింది. ఏపీ ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఆయన్ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story
Share it