ఉచిత విద్యుత్‌పై సమీక్ష
By సుభాష్ Published on 12 Oct 2020 5:04 PM ISTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యుత్‌శాఖ, ఉచిత విద్యుత్‌పై సోమవారం సమీక్షించారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చినంత మాత్రాన రైతులపై ఒక్కరూపాయి కూడా భారం పడబోదని అన్నారు. ఈ విషయాన్ని రైతులు నమ్మే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యుత్ సరఫరా చేసుకునే వీలు కలుగుతుందని, దీని వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా 9గంటల పాటు విద్యుత్ సరఫరా చేయవచ్చని అన్నారు. ఆ విద్యుత్ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు.
ఆ తర్వాతే రైతులు అదే నగదును విద్యుత్ బిల్లు కింద డిస్కమ్‌లకు చెల్లిస్తారన్నారు. మొత్తం ఈ ప్రక్రియలో రైతులపై ఏ మాత్రం భారం పడకూడదని, వారికి ఇంకా నాణ్యమైన విద్యుత్ అందుతుందని చెప్పారు. ఇదే విషయమై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు అన్ని గ్రామ సచివాలయాల్లో పోస్టర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను 9 గంటల పాటు నిరంతరాయంగా సరఫరా చేయడం కోసమే మీటర్లు ఏర్పాటు చేయాలన్న విషయంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
కాగా, మీటర్ల ఏర్పాటు వల్ల ఎలాంటి భారం పడబోదన్న విషయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ఇప్పటికే 14,354 లైన్‌మెన్లకు శిక్షణ ఇచ్చినట్లు సమావేశంలో అధికారులకు తెలిపారు. అన్ని ఫీడర్ల కింద వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. అయితే 97శాతం వరకు ఫీడర్లు పూర్తి కాగా, మిగిలినవి కూడా నవంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు.