సమ్మక్క-సారలమ్మలకు అమరావతి రైతుల మొర.!
By అంజి Published on 8 Feb 2020 7:24 AM GMT
వరంగల్: తెలంగాణ కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరకు అమరావతి రైతులు వచ్చారు. రాజధానిని అమరావతిలో ఉండాలని వనదేవతలకు రైతులు ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క-సారలమ్మల గద్దెల వద్ద అమరావతి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అమ్మవార్లకు ఇష్టమైన బెల్లాన్ని సమర్పించారు. అమరావతి రైతులు బస్సులో మేడారం జాతరకు వచ్చారు. తమ కోరికను సమ్మక్క సారలమ్మలు కచ్చితంగా నెరవేరుస్తారని అమరావతి రైతులు నమ్ముతున్నారు.
ఇప్పటికే అమరావతి మహిళ రైతులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండేలా చొరవ తీసుకోవాలని అమరావతి రైతు ఐక్య కార్యచరణ సమితి, టీడీపీ ఎంపీలు కలిసి కేంద్రమంత్రులను కోరుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సైతం రాజధాని విషయమై వినతి పత్రం సమర్పించారు. త్వరలో ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలను అమరావతి రైతులు కలవనున్నారు.
ఇదిలా ఉంటే మేడారంలో లక్షలాది మంది భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. శుక్రవారం నలుగురు దేవరలను దర్శించుకోవడానికి భక్తులు ప్రవాహంలా తరలివచ్చారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా నేడు సాయంత్రం సమ్మక్క, సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్దరాజు పూనుగుండ్లకు వెళ్లనున్నారు.