జగన్ తో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయిస్తా : డిప్యూటీ సీఎం

By రాణి  Published on  15 Feb 2020 1:01 PM GMT
జగన్ తో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయిస్తా : డిప్యూటీ సీఎం

ఎన్ ఆర్ సీ (National Register of Citizens) పై కేంద్రం ముందుకెళ్తే రాజీనామా చేస్తానంటూ ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఎన్డీయే పెద్దలను కలిసి..మూడు రాజధానులు, మండలి రద్దు విషయాలపై మంతనాలు చేస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. శనివారం కడపలో మీడియా మాట్లాడిన ఆయన..ఎన్ఆర్సీని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

తనకు పదవులకన్నా ప్రజలే ముఖ్యమని తెలిపారు. ఎన్ఆర్సీపై కేంద్రం ఇంకా ముందుకెళ్తే తాను రాజీనామా చేయడానికైనా వెనుకాడన్నారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సీఎంను తాను ఒప్పిస్తానన్నారు. వైసీపీ ఎన్డీయేలో చేరుతుందన్న ప్రచారం అసత్యమని, 151 సీట్లు గెలిచిన వైసీపీ ఎన్డీయేలో ఎలా కలుస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ర్టంలో బీసీలు, మైనార్టీల కోసం పనిచేస్తున్న లౌకిక పార్టీ వైసీపీ అని..అలాంటి పార్టీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో కలవడానికి సిద్ధపడదన్నారు.

Next Story