షోకాజ్ ఇస్తే సైలెంట్ గా సైడ్ చేశారు...!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2019 4:27 PM ISTఅమరావతి: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మిక బదిలీ చేసింది. ఏపీ హ్యుమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్సిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గా ఎల్వీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలలో ఎల్వీ సుబ్రహ్మణ్యం రిటైర్డ్ కానున్నారు. జీఎడీ పొలిటికల్ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ రావు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఏపీ ఇంచార్జ్ ప్రభుత్వ కార్యదర్శిగా నారబ్ కుమార్ ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. సీఎస్ రేసులో 1984 బ్యాచ్‌కు చెందిన నీలమ్ సహనీ, సమీర్ శర్మ ఉన్నారు. ప్రస్తుతం సీసీఎల్‌ఏలో నీరబ్ కుమార్ విధులు నిర్వర్తించనున్నారు.
సీఎస్ ఎల్వీ బదిలీ వెనుక కారణాలు ఏంటీ..?
అసలు ఎల్ వీ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది...? పదవి కాలం మరో ఐదు నెలలు ఉండగానే బదిలీ చేయాల్సిన అవసరమేంటి.?. అదీ కూడా తన కంటే కింద స్థాయి ఉన్నతాధికారి పేరుతో మీద బదిలీ ఉత్తర్వులు జారీ అవ్వడమేంటి.?...సీఎం కావాలనే బదిలీ చేయించారా....? లేదంటే అవినీతికి తావునిచ్చేలా సీఎస్ ఏమైనా వ్యవహరించారా.....? సీఎస్ ఆశించిన స్థాయిలో పని చేయలేదా...?ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నాయి.
జగన్ ప్రభుత్వం గత కేబినెట్‌లో ‘వైఎస్ఆర్ అవార్డు’ పేరుతో ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. అయితే, దానికి సంబంధించిన ఫైల్ మీద ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. కానీ, ఆ పనిచేయకుండా ప్రవీణ్ ప్రకాష్ నేరుగా కేబినెట్‌లో ప్రవేశపెట్టినట్టు సమాచారం. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎల్వీ సుబ్రమణ్యం.. ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆగ్రహంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసినట్టు సమాచారం. ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ ఉత్తర్వులను కూడా ప్రవీణ్ ప్రకాష్ జారీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు.
సీఎస్ ఒంటెద్దు పోకడలను సహించలేకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదనలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎంతో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ చర్చలు జరిపిన తర్వాతే జీవో రిలీజ్ చేశారని తెలుస్తుంది. ముఖ్యంగా సీఎస్ గా పనిచేసిన వ్యక్తిని యంగ్ ఐఏఎస్ లకు కేటాయించే హెచ్ఆర్డీ డీజీగా పంపడం అనేది మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. తేడా వస్తే ఊహించని దాని కంటే ఎక్కువగానే ప్రభావం ఉంటుందనే సంకేతాలు పంపారేమోననే భావన కలుగుతోంది.