ఏపీలో తొలి కరోనా మరణం

By సుభాష్  Published on  3 April 2020 8:36 AM GMT
ఏపీలో తొలి కరోనా మరణం

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత్‌లో కూడా కరోనా కేసులు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఇక తాజాగా ఏపీలో తొలి కరోనా మరణం నమోదైంది. షేక్‌ సుభాని (55) అనే వ్యక్తి కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. షేక్‌ సుభాని డయాబెటిస్‌ కార్డియాక్‌ ఆరోగ్య సమస్యలతో మార్చి 30న విజయవాడలోని జనరల్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.

కాగా, ఆయన కుమారుడు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో కుమారుడితో పాటు సుభానికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో సుభాని చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఇక బాధితుడితో కాంటాక్ట్‌ అయిన 29 మందిని గుర్తించి, వారందరిని క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఇక ఢిల్లీ ప్రార్థనల నేపథ్యంలో ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అంతకు ముందు పాజిటివ్‌ కేసుల సంఖ్య నెమ్మిదిగా పెరుగుతుండగా, ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కారణంగా పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారు ఎవరెవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తోంది ఏపీ ప్రభుత్వం. శుక్రవారం నాటికి రాష్ట్రంలో 161 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య 2 వేలకుపైగా దాటేసింది.

Next Story
Share it