ఆ పత్రికవి తప్పుడు రాతలు..ఏపీ సీఎంవో
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Sep 2019 5:44 AM GMT- కేంద్రంపై ఇద్దరు సీఎంలు అసంతృప్తి అంటూ ఓ పత్రిక కథనం
- ఉద్దేశపూర్వకంగానే రాశారని భావిస్తున్నామన్న ఏపీ సీఎంవో
- తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా సీఎంల భేటీ
- స్పష్టం చేసిన ఏపీ సీఎంవో
అమరావతి: కేంద్రంపై ఇద్దరు సీఎంలు అసంతృప్తిగా ఉన్నారంటూ ఓ పత్రిక ప్రచురించిన కథనం కల్పితమని ఏపీ సీఎంవో ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో అలాంటి అంశమే ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేసింది. సంబంధిత పత్రికకు ఊహాజనిత అంశాలు ప్రచురించవద్దని హితవు పలికింది. ప్రజలను తప్పు దోవ పట్టించవద్దని సీఎంవో పేర్కొంది. తప్పుడు వార్తలు రాసిన ఆ పత్రిక కథనాన్ని ఖండిస్తున్నట్లు ఏపీ సీఎంవో పేర్కొంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారని తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్..గోదావరి జలాలపై చర్చించడానికి ప్రగతి భవన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు లక్ష్యంగా సీఎంల మధ్య చర్చలు సాగాయని ఏపీ సీఎంవో కార్యాలయం పేర్కొంది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నుంచి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా జగన్, కేసీఆర్‌ల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఏపీ సీఎంవో గుర్తు చేసింది. రాజకీయ ఎజెండాలేవీ ఈ సమావేశాల్లోలేవని..రాజకీయ చర్చలకు దూరమని స్పష్టం చేసింది. గోదావరి జలాలు తరలింపుపై ఇరు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘంగా చర్చలు జరిపారని తెలిపింది. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే దిశగా సీఎంలు చర్చలు జరిపారని ఏపీ సీఎంవో ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
గోదావరి జలాల మీదనే కాకుండా..ఇప్పటి వరకు పరిష్కారం కాని విభజన అంశాల మీద కూడా రెండు రాష్ట్రాల సీఎంలు చర్చలు జరిపారని ఏపీ సీఎంవో ప్రకటించింది. తెలంగాణలో కొత్తగా నియామకమయ్యే పోలీస్ కానిస్టేబుళ్లకు ఏపీలో శిక్షణ ఇచ్చే అంశం మీద చర్చ జరిగింది. విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కారం మీద కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టి పెట్టినట్లు చెప్పింది. సీఎంల సమావేశంలో కేవలం రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మాత్రమే చర్చించారని ఏపీ సీఎంవో స్పష్టం చేసింది. ఊహాజనిత కథనాలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఏపీ సీఎంవో సంబంధిత పత్రికను ఉద్దేశించి పేర్కొంది.