నేడు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
By Newsmeter.Network Published on 13 Jan 2020 9:05 AM ISTహైదరాబాద్: ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు భేటీ కానున్నారు. ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కలవనున్నారు. తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించనున్నట్లు సమాచారం. కాగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు వీరి భేటీ కొనసాగుతుందని ప్రగతిభవన్ వర్గాలు తెలుపాయి. అయితే ఈ భేటీలో ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొనడం లేదు. విభజన సమస్యల పరిష్కారం, తొమ్మిది, పదో షెడ్యూల్డ్ సంస్థల విభజన, గోదావరి కృష్ణా నదుల అనుసంధానంపై ప్రధానంగా వీరు చర్చిస్తారని తెలుస్తోంది.
సీఏఏ, ఎన్‌ఆర్సీ, విద్యుత్ ఉద్యోగుల, డీఎస్పీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థతో పాటు పలు ఇతర అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నారు. రెండు రాష్ట్రాల స్వప్రయోజనాలే లక్ష్యంగా కీలక అంశాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సంప్రదింపులు జరగనున్నాయి. ఏపీ సీఏం వైఎస్ జగన్ శనివారం నాడే హైదరాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతున్నారు. గత సెప్టెంబర్ 23న ప్రగతిభవన్‌లో కేసీఆర్, జగన్ భేటీ అయ్యారు. అప్పుడు కూడా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించారు. ఏపీ మూడు రాజధానుల అంశం కూడా వీరి భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి.