' కంటి వెలుగు': కేసీఆర్ బాటలో వైఎస్ జగన్..!
By Newsmeter.Network Published on 9 Oct 2019 6:20 PM ISTఅమరావతి: అక్డోబర్ 10న ప్రపంచ దృష్టి దినోత్సవం. ఈ సందర్భంగా 'వైయస్సార్ కంటి వెలుగు'పథకాన్ని ప్రారంభిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. రేపు అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో 'వైయస్సార్ కంటి వెలుగు' పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. మొదట బడి పిల్లలతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. అక్టోబర్ 10 నుంచి 16 వరకు మొదటి దశలో 70 లక్షల మంది విద్యార్దులకు కంటి పరీక్షలు చేస్తారు. నవంబర్ 1 నుంచి 31 వరకు రెండో దశలో అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారు. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా వైద్య సేవలు ఉచితంగా చేయనున్నారు. మొత్తం ఆరు దశల్లో మూడేళ్ల పాటు 'వైఎస్ఆర్ కంటి వెలుగు' పథకం అమలవుతుంది. ఫిబ్రవరి 1 నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు.
చైర్మన్ లుగా జిల్లా కలెక్టర్లు
జిల్లా కలెక్టర్లు ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్ఫోర్స్ కమిటీలు జిల్లాస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. అన్ని పీహెచ్సీలకు కంటి పరీక్షలకు సంబంధించిన కిట్లను ఇప్పటికే పంపించారు. 42360 మంది ఆశావర్కర్లు, 62500 మంది టీచర్లు, 14000 మంది ఏఎన్ఎంలు, 14000 మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే 'వైఎస్ఆర్ కంటి వెలుగు' కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు మొదటి విడతలో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు, ఆరు దశల్లో కమ్యూనిటి బేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1, 2020 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలు పెడతారు.