మద్యం ప్రియులకు సీఎం జగన్ సూచనలు
By సుభాష్ Published on 13 April 2020 6:45 PM ISTకరోనా దెబ్బకు దేశమంతా అతలాకుతలం అవుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో అన్ని షాపులతో పాటు మద్యం షాపులు సైతం మూతపడ్డాయి. దీంతో మద్యం ప్రియులకు ఎక్కడలేని కష్టాలు వచ్చిపడ్డాయి. మద్యం లేకుండా ఉండలేకపోతున్నారు. కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరి కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మద్యానికి బానిసైన వారికి చుక్కమందులేనిదే బండి ముందుకు నడవడం లేదు.
ఇంకొందరేమో మద్యం లేక చోరీలకు పాల్పడుతున్నారు. ఇక కొన్నిరాష్ట్రాల్లో అయితే సమయం బట్టి మద్యం షాపులు తెరిచేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే అందుకు విరుద్దంగా ఉంది. రెండు ప్రభుత్వాలు కూడా మద్యం విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. ఇక ఏపీలో ముందే మద్య నిషేధం విధించగా, లాక్‌డౌన్ సమయాన్ని చూసుకుని మరింత ముందుకు వెళ్తోంది. అందుకు లాక్‌డౌన్‌ను వేదికగా మలుచుకోవాలని చూస్తోంది. మందుబాబుల కోసం సీఎం జగన్ సైతం పలు సూచనలు చేశారు.
కొందరైతే మద్యం దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తించడం, నిద్రలేని రాత్రులు గడపడం లాంటివి తలెత్తుతున్నాయి. అలాంటి వారు తాము చేసిన సూచనలు పాటించాలని చెబుతున్నారు సీఎం జగన్. నిద్ర పట్టనివాళ్లు పిల్లలతో ఆడుకోవడం, టీవీ చూస్తూ కాలక్షేపం చేయడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు.
అంతేకాదు తోట పని చేయడం, వ్యాయమం చేయడం, తరుచూ నీళ్లు తాగడం, 8 నుంచి 9 గంటల పాటు నిద్రపోవడంతో మానసిక సమస్యలన్నీ దూరమవుతాయని సూచిస్తున్నారు. ఇక కాళ్లు, చేతులు వణకడం, విచిత్రంగా ప్రవర్తించడం లాంటివి చేస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లాక్‌డౌన్ ప్రతీ ఒక్కరికి వరమని, కుటుంబంతో గడిపే సమయం దొరుకుతుందని, ఆర్థిక పరిస్థతులను మెరుగుపర్చుకోవచ్చని చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్లుకుండా లాక్‌డౌన్‌ను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.