పదో తరగతి పరీక్షలపై నేడో, రేపో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

By సుభాష్  Published on  20 Jun 2020 2:37 AM GMT
పదో తరగతి పరీక్షలపై నేడో, రేపో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశమంతా కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతోంది. వైరస్‌ కట్టడి కోసం రెండు నెలలకుపైగా లాక్‌డౌన్‌ విధించి అన్ని రంగాలతో పాటు విద్యా సంస్థలు సైతం మూతపడ్డాయి. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థుల పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో విద్యార్థుల్లో ఒక రకమైన టెన్షన్‌ ఏర్పడింది. పరీక్షలు ఎప్పుడెప్పుడా అని తల్లిదండ్రులు సైతం ఎదురు చూస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం టెన్త్‌ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోగా, ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఏపీలో పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై నేడు, లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టెన్త్‌ పరీక్షలు నిర్వహణ అంశంపై ఏపీ అధికారులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న క్రమంలో పరీక్షలు నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలనే అనే అంశంపై గురు, శుక్రవారాల్లో నిర్వహించిన సమావేశాల్లో అధికారులు చర్చించారు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరైంది కాదని, పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్‌ చేస్తున్నాయి.

మరో వైపు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరికొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలోనూ ఇదే విధంగా అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది.

Next Story
Share it