అనుష్క కోసం షూటింగ్ స్పాట్‌కి వెళ్లి నిద్రపోయిన కోహ్లీ
By తోట వంశీ కుమార్ Published on 18 May 2020 4:10 PM ISTలాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం క్రికెటర్లు ఇంటికే పరిమితం అయ్యారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ లాక్‌డౌన్ సమయాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్నాడు కోహ్లీ. తాజాగా భారత పుట్‌బాట్ కెప్టెన్ సునీల్ ఛెత్రీతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడాడు. కాగా.. ఛెత్రీ వేసిన పలు ప్రశ్నలకు కోహ్లీ సమాధానాలు చెప్పాడు. ఈ ఇద్దరి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి.
విరాట్, అనుష్కల గురించి అనేక విషయాలను ఛెత్రీ గుర్తు చేశాడు. విరాట్ కోహ్లీకి మద్దతుగా అతడు ఆడే మ్యాచులు అన్ని అనుష్క చూస్తుందని.. అయితే కోహ్లీ మాత్రం అలా ఉండడని అన్నాడు. లండన్ వెళ్లినప్పుడు కోహ్లీ అనుష్కకు మద్దతుగా ఆమె షూటింగ్ స్పాట్‌కు వెళ్లి నిద్రపోయిన విషయాన్ని ఛెత్రీ ప్రస్తావించాడు. దీనికి కోహ్లీ వివరణ ఇస్తూ.. తాను అప్పటికే విమానంలో గంటల తరబడి ప్రయాణం చేశానని, విమానం దిగేసరికి చీకటి పడడంతో హోటల్‌రూమ్ దొరకలేదని, బాగా అలసిపోవడంతో పక్కనే ఉన్న వ్యాన్‌లో పడుకున్నానని ఈ విషయాన్ని అనుష్కకు చెప్పమని అక్కడే ఉన్న ఓ వ్యక్తికి చెప్పానని అయితే.. ఆ వ్యక్తి ఆ విషయాన్ని మరిచిపోయాడని, తాను అలసిపోతే నిద్రకు ఆగలేనని కోహ్లీ చెప్పాడు. కోహ్లీ ఇలా చెబుతుండగా.. అక్కడే ఉన్న అనుష్క శర్మ అబద్ధాల కోరు అంటూ గట్టిగా అరిచింది. దాంతో ఛెత్రీ, కోహ్లీ ఇద్దరు బాగా నవ్వుకున్నారు.
భూటాన్ వెళ్లినప్పడు ఇద్దరు సైక్లింగ్ చేస్తూ కోహ్లీ అనుష్కను వదిలివెళ్లిపోయాడని ఎందుకు అలా చేశావని ఛెత్రీ కోహ్లీని అడిగాడు. ఇద్దరం సైక్లింగ్ చేస్తుండగా.. అనుష్క తన వెనక ఉందని, ఇంతలో ఓ అభిమాని తనను గుర్తుపట్టడంతో అనుష్కను వదిలేసి అక్కడి నుంచి ముందుకెళ్లానని చెప్పాడు. కొద్ది దూరం వెళ్లాక ఆమె కనిపించకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చానని, అయితే.. ఆ సమయంలో అనుష్క నేను ఎవరో తెలియదన్నట్లు ప్రవర్తించిందని అప్పటి సంఘటనను చెప్పుకొచ్చాడు.
తన బయోపిక్‌ను తీస్తే మాత్రం అందులో ఖచ్చితంగా నటిస్తానని, కాకపోతే అందులో తన భార్య అనుష్క శర్మ కూడా నటించాలనే కండీషన్ పెట్టాడు. అనుష్క రాకతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని, ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. 2015 ఫిట్‌నెస్‌పై శ్రద్ద తీసుకుంటున్నానని, అప్పటి నుంచే తన కెరీర్ గ్రాఫ్ క్రమేపీ పెరుగుతూ వచ్చిందని కోహ్లీ తెలిపాడు.