ముఖ్యాంశాలు

  • ఏకకాలంలో ఏసీబీ సోదాలు

  • భారీ మొత్తంలో నగదు స్వాధీనం

ఏపీలో ఏసీబీ పంజా విసిరింది. ఒకే రోజు 13 జిల్లాల్లో మెరుపు దాడులు చేపట్టింది. జిల్లాల్లో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపట్టిన ఈ మెరుపు తీవ్ర సంచలనంగా మారింది. ఏకకాలంలో సోదాలు చేపట్టడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఈ దాడుల్లో రూ. 10.34 ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రజల నుంచి టోల్ ఫ్రీ నెంబర్ 14400 ఫిర్యాదులు రావడంతోనే ఈ మెరుపు దాడులు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

విజయనగరం వెస్ట్ జోన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టి రిజిస్ట్రేషన్ కు వస్తున్న వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిపినట్లు ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. 8 మంది అనధికార డాక్యుమమెంట్ రైటర్ల నుంచి రూ. 50 వేలు, కార్యాలయ సిబ్బంది నుంచి రూ.11వేలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ మూర్తి నుంచి రూ. 2 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే ఇంకొంత మంది ప్రైవేటు సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇక తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా సోదారులు నిర్వహించారు. అయితే ముందస్తుగా సమాచారం తెలుసుకున్న సిబ్బంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇక కాకినాడ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించగా, సిబ్బంది వద్ద అనధికారికంగా రూ. ఒక లక్షా, 29 వేల 640 నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు చేపట్టారు.

విశాఖ జిల్లా, అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావు సమక్షంలో రూ. 83, 660 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించి రూ. 84వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని విచారించారు.

గుంటూరు జిల్లా తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ. 16,250 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇలా ఏకకాలంలో 13జిల్లాలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.