ఎర్రని మంచు.. ఎక్కడంటే.?
By అంజి
నలుపు రంగు గురించి చెప్పినప్పుడు కాకి గురించి ఎలా ఉదాహరణ ఇస్తామో తెలుపు గురించి చెప్పినప్పుడు మంచును అలాగే ఎగ్జామ్పుల్ గా చూపిస్తాం. కానీ అంటార్కిటికా ఖండంలోని ఈ మంచుని చూడండి. ఇది ఎర్రని రక్తం రంగులోకి మారి చూసేవారిని భయ పెడుతోంది. ఈ ఎరుపు రంగులోకి మారిన మంచు అంటార్కిటికాలోని మాజీ బ్రిటిష్ పరిశోధనా కేంద్రం వద్ద కనిపించింది.
అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో గడ్డ కట్టిన మంచులో జీవించే మైక్రోస్కోపిక్ ఆల్గే కారణంగా ఎరుపు రంగులోకి మారినట్టు తెలుస్తోంది. ఈ ఎరుపు రంగులో ఉన్న మంచుకు సంబంధించిన ఫోటోలను ఓ ట్విటర్ యూజర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎరుపు రంగులోకి మారిన అంటార్కిటికా మంచు.. వాతావరణ మార్పులు అరిష్టం అనే సంకేతాన్ని ఇస్తోంది.
మంచుతో నిండిన ఈ ఖండం చట్టూ వాతావరణం వేడెక్కుతోంది అంటూ కాప్షన్ పెట్టారు. అలాగే ఈ చిత్రాలను ఉక్రెయిన్ దేశ విద్యా, విజ్ఞాన మంత్రిత్వ శాఖ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘అంటార్కిటికా ఖండంలోని మంచు.. వేసవి కాలం ఆరంభ సమయంలో మైక్రోస్కోపిక్ ఆల్గే కారణంగా ఎరుపు రంగులోకి మారుతుంది’ అని పేర్కొంది.
క్లామిడోమోనాస్ నివాలిస్ ఆల్గే యొక్క కణాలు ఎర్ర కెరోటిన్ పొరను కలిగి ఉన్నాయని, ఇది అతినీలలోహిత కిరణం నుండి రక్షిస్తుందని మరియు మంచులో ఎర్రటి మచ్చలను ఉత్పత్తి చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎరుపు-క్రిమ్సన్ రంగు కారణంగా, మంచు తక్కువ సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది మరియు వేగంగా కరుగుతుంది అని వివరించింది.