ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక అవార్డ్ స్థాపించాం- నాగార్జున‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 6:30 AM GMT
ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక అవార్డ్ స్థాపించాం- నాగార్జున‌

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో 'ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు' ఒకటి. నటసామ్రాట్‌, డా. అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ చేత స్థాపించబడింది. ఈ అవార్డు ఒక వ్యక్తి జీవితకాల విజయాలు, భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికిగాను అందజేయ బడుతుంది. 2018 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రముఖ నటి శ్రీదేవి, 2019 సంవత్సరానికి గాను నటి రేఖకు ఈ అవార్డు లభించింది. న‌వంబ‌ర్‌17న అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఈ కార్య‌క్ర‌మం అంగ‌రంగ‌ వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై ఈ అవార్డ్ ను శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, నటి రేఖ లకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. సినిమా మాత్రమే నాకు తల్లి తండ్రి, అదే నాకు అన్నీ ఇచ్చింది. కృతజ్ఞతగా ఆ తల్లి ఋణం తీర్చుకోవడానికి ఒక అవార్డ్ స్థాపించడం జరిగింది. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చే వారికి ఇవ్వాలని ‘ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్’ సృష్టించబడింది. ఇవి ఈ అవార్డ్స్ గురించి నాన్న చెప్పిన మాటలు. ఆయన సంకల్పమే మమ్మల్ని నడిపిస్తుంది. ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాము. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చే వారికి ఈ ‘ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్’ ఇచ్చి వారిని సగౌరవంగా సన్మానించుకొని వారి పేరుతో పాటు నాన్న పేరు కూడా చిరకాలం ఉండేలా ఈ అవార్డు కార్యక్రమం జరుగుతుంది. శ్రీదేవికి, రేఖకు ఈ అవార్డ్ ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు. ఆయన ఉన్నప్పుడు ఈ అవార్డ్ ఇవ్వలేక పోయాం. కానీ తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఈ అవార్డ్ ఉంటుంది. ఈ వేదిక మీద అవార్డ్ తో పాటు నాన్న ఇక్కడే మన మధ్యనే ఉన్నారు.

Nagarjuna1

శ్రీదేవి తో నేను నాలుగు సినిమాలు చేశాను. మొదటి సినిమా ‘ఆఖరి పోరాటం’. ఆవిడ సెట్ కి వస్తున్నప్పుడు అప్పటిదాకా గొడవ గొడవగా ఉండే సెట్ సైలెంట్ గా అయిపోయేది. శ్రీదేవి ‘ది గాడెస్ ఆఫ్ గ్రేస్’. శ్రీదేవి గారికి దేవుడిచ్చిన అందం అభినయం ఆమె అదృష్టం అన్నారు. కానీ దానికన్నా ఎక్కువ అదృష్టం బోని కపూర్ భర్తగా లభించడం. వారిద్దరూ నాకు చాలా కాలంగా తెలుసు. ‘హిమ్మత్ వాలా’ అనే సినిమా ఆమెను హిందీలో స్టార్ చేస్తే బోని కపూర్ తీసిన’ మిస్టర్ ఇండియా’ ఆమెను నేషనల్ సూపర్ స్టార్ గా చేసింది.

సినిమా పరిశ్రమ ఉన్నంత వరకూ ఎఎన్‌ఆర్‌, శ్రీదేవి బ్రతికే ఉంటారు. అలాగే రేఖ గారి మొదటి సినిమా ఒక తెలుగు సినిమా 'రంగుల రాట్నం'. ఆమెకి ఈ అవార్డ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

Next Story