ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2019 8:09 AM GMT
ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె..

వరంగల్‌: ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం చొరవ చూపకపోవడం, ఉద్యోగం పోయిందన్న ఆవేదనతో ఆర్టీసీ కార్మికులు సతమతమవుతున్నారు. తాజాగా మరో ఆర్టీసీ కార్మికుని గుండె ఆగింది. హన్మకొండ డిపోకు చెందిన రవీందర్ నాలుగు రోజుల క్రితం టీవీ చూస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో అతడిని వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు రవీందర్‌ శనివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. పోలీసులు రవీందర్‌ మృతదేహాన్ని స్వస్థలం వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరుకు తరలించారు. రవీందర్‌కు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవీందర్‌ మృతితో ఆర్టీసీ కార్మికులు పెద్త ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఆత్మకూరులో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

రవీందర్‌ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. పరకాల డిపో ముందు బైఠాయించి.. బస్సులు బయటకు వెళ్లకుండా కార్మికులు అడ్డుకున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 30వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు.

భవిష్యత్‌ కార్యచరణను ప్రకటించారు. అలాగే సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈ నెల ఐదో తేదీలోగా విధుల్లో చేరాలని, లేని పక్షంలో వారికి ఆర్టీసీతో సంబంధాలు తెగిపోయినట్లేనన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో కార్మిక సంఘాల జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించారు.

Next Story