బెజవాడలో మరో గ్యాంగ్‌వార్.. ఆలస్యంగా వెలుగులోకి..!
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2020 7:31 AM GMTబెజవాడలో కొద్దిరోజుల కింద సందీప్-కేటీఎం పండు మధ్య జరిగిన గ్యాంగ్ వార్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ఘటనను మరువకముందే తాజాగా మరో గ్యాంగ్ వార్ ఘటన చోటుచేసుకుంది. జూలై 31వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మున్నా-రాహుల్ గ్యాంగ్‌లు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
కేదారేశ్వరపేట ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్ నాగుల్ మీరా అలియాస్ మున్నా, రాహుల్‌లు చెరో గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నారు. కాగా.. వీరిద్దరి మధ్య గతంలో పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 31న రాహుల్ వర్గం నాగుల్ మీరా వర్గంపై దాడి చేసింది. కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో రాహుల్‌తో పాటు అయోధ్యనగర్‌కు చెందిన వినయ్ తదితరులు పాల్గొన్నారు. దీంతో నాగుల్ మీరా వర్గం కూడా అదే రాత్రి 7.30గంటలకు రాహుల్ వర్గం పై దాడి చేశారు. ఈ దాడిలో ఈసబ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. రెండు గ్యాంగ్‌లు దాడుల అనంతరం సైలెంట్‌గా ఉండడంతో విషయం బయటలకు రాలేదు.
కాగా.. వినయ్ అనే యువకుడు మున్నా వర్గం తనపై దాడి చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది. రంగంలోకి దిగిన పోలీసులు షేక్ నాగుల్ మీరా(25), షేక్ ఈసబ్(26), లావేటి సాయికుమార్(24), సాయి పవన్(20) కంది సాయి (20)లతో పాటు మరో ఇద్దరు బాలలను సోమవారం అరెస్టు చేసి కోర్టు హజరు పరిచారు. అరెస్టు చేసిన వారి నుంచి ఓ ద్విచక్రవాహనం, కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. మరోవైపు షేక్ నాగుల్ మీరా కూడా ఆదివారం(అగస్టు 9) సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగుల్ మీరా ఫిర్యాదుతో ఖుద్దూస్‌నగర్‌కి చెందిన రాహుల్,అతని అనుచరులైన సాయి కిరణ్, పుట్టా వినయ్, వికాస్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు యువకుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా, విజయవాడలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకప్పుడు రౌడీయిజం, గ్యాంగ్‌లకు పెట్టింది పేరైన బెజవాడలో మళ్లీ ఇలాంటి ఘర్షణలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.