విరాట్ కోహ్లీలో మీకు తెలియని మరో కోణం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Nov 2019 6:37 PM IST
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్.. అంతకన్నా గొప్ప ఫీల్డర్. ఆయన కు లూజ్ బాల్ వేస్తే అది బౌండరీ దాటి కనుమరుగు కావాల్సిందే. ఫీల్డింగ్‌లో ఉంటే ఆయన చేతుల్లోంచి ప్రత్యర్థి కొట్టిన బంతి ఆయన చేయి దాటి బౌండరీకి వెళ్లదు కాక వెళ్లదు. అంత గొప్ప క్షేత్ర రక్షకుడు విరాట్ కోహ్లీ.
అయితే విరాట్ క్రికెట్ మాత్రమే కాదు ... ఇంకో విషయంలోనూ గట్టిగానే బ్యాటింగ్ చేస్తాడు. అదే జంతువుల హక్కుల కోసం ఆయన చేసే పోరాటం. విరాట్ కి జంతువులంటే చాలా ఇష్టం. అయితే హై సొసైటీ వాళ్ల లాగా మేలు జాతి కుక్కలు, వింత వింత జంతువులతో ఇంటిని జూ గా మార్చేసి.. “మా పప్పీ..” అంటూ పోజులు కొట్టే రకం కాదు విరాట్ కోహ్లీ. గాయపడ్డ వీధి కుక్కల బాగోగుల కోసం విరాట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మధ్యమధ్యలో బెంగుళూరులో గాయపడ్డ కుక్కల సంరక్షణ కోసం ఉన్న ఆస్పత్రికి ఆయన వెళ్తూంటాడు. ఆ కుక్కలను దత్తత తీసుకొమ్మని మిత్రులను ప్రోత్సహిస్తూ ఉంటాడు. అంతే కాదు. ఇటీవల జైపూర్ లోని అజ్మీర్ కోట వద్ద ఉన్న మాలతి అనే ఏనుగును కాపాడాలని ఆయన జంతువుల పట్ల హింసను వ్యతిరేకించే అంతర్జాతీయ సంస్థ పేటా తరఫున అధికారులకు లేఖ వ్రాశాడు. మాలతిని ఎనిమిది మంది చిత్ర హింసలకు గురి చేశారని, దానిని తీవ్రంగా గాయపరిచారని విరాట్ అధికారులకు తెలియచేశారు.
విరాట్ జీవ కారుణ్యం పలువురి ప్రశంసలందుకుంటోంది. అతనికి 'పేటా పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019' అన్న అవార్డునిచ్చింది. ఈ జంతు ప్రేమికుడిని మనసారా అభినందిద్దామా మరీ?