కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగకుండా ఇంకా సాధ్యమైనంత ముందే అమలు చేస్తుంది జగన్ సర్కార్. వరుసగా మూడో ఏడాది కూడా వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ లు నడుపుకుంటున్న వారికి రూ.10వేలు వేసేందుకు సిద్దమైంది ఏపీ ప్రభుత్వం. నేడు (మంగళవారం) తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్ధికసాయం విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనాల మరమ్మతులు, బీమా, ఇతర ఖర్చుల కోసం ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రూ.248.46 కోట్లు వారి బ్యాంక్ అకౌంట్లలో వెయ్యనున్నారు. ఈ ఏడాది 2,48,468 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రయోజనం కల్పించనున్నారు.
ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు 'వైఎస్సార్ వాహన మిత్ర' పథకం కింద ప్రతీ ఏడాది జగన్ ప్రభుత్వం రూ. 10వేలను ఇస్తుంది. ఈ పథకం ద్వారా ఏటా వారికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తూ.. డబ్బును వాహనాల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవాలని సూచిస్తుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల ప్రక్రియకు అవకాశం కల్పించగా.. దరఖాస్తు ప్రక్రియలో గ్రామవాలంటీర్లు సాయం చేస్తున్నారు.