వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాను వేసిన పిటిషన్‌లో మధ్యంతర దరఖాస్తును అవినాశ్ న్యాయవాది దాఖలు చేశారు. మార్చ్ 14 న సీబీఐ జరిపిన విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ ఇవ్వాలని కోర్టును అవినాశ్ పిటిషన్‌లో కోరారు. వైఎస్ వివేకా హత్య కేసులో.. సీబీఐ అధికారులు నాలుగు సార్లు అవినాష్ రెడ్డిని విచారించింది.
ఈ కేసును అధికారులు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని గతంలో అవినాష్ రెడ్డి ఆరోపించారు. వివేకానందరెడ్డి మరణించిన సమయంలో దొరికిన లేఖను బహిర్గతం చేయాలని సీబీఐని కోరినట్టుగా అనినాష్ రెడ్డి చెప్పారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ తనకు తెలిసిన వాస్తవాలతో సీబీఐకి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. ఈ కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.