వైఎస్ వివేకానంద రెడ్డి మరణానికి ముందు రాసిన లేఖపై వేలిముద్రలు ఉన్నాయో లేదో తనిఖీ చేసేందుకు 'నిన్‌హైడ్రిన్ టెస్ట్' నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు సోమవారం రిజర్వ్‌లో ఉంచింది. బుధవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి. గతంలో ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ.. ఒత్తిడితోనే వివేకానందరెడ్డి లేఖ రాశారని పేర్కొంది. అందులోని రసాయనం రాత దెబ్బతినే అవకాశం ఉన్నందున నిన్‌హైడ్రిన్ పరీక్ష నిర్వహించేందుకు సీఎఫ్‌ఎస్‌ఎల్ మొగ్గు చూపలేదు.
కాగా వివేకా హత్యకేసు నిగ్గు తేల్చేందుకు ఉపయోగపడే ఈ ప్రక్రియపై కోర్టు నిర్ణయం కోసం సీబీఐ ఎదురుచూస్తోంది. ఈ లేఖలో డ్రైవర్ ప్రసాద్ తన హత్యకు కారణమని, వదిలి పెట్టవద్దని చనిపోయేముందు రాసినట్టుగా ఉంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. భాస్కర్ రెడ్డి ఏప్రిల్ 16 నుండి జైలులో ఉన్నారు. వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత నర్రెడ్డి తన వాదనలు సమర్పించాలని కోరుతూ చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు వాయిదా వేసింది.