వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లవుతున్నా.. ఇప్పటివరకు నిందితుల‌ను ప‌ట్టుకోలేద‌ని ఆయ‌న కుమారై సునీతారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ కు బాబాయి అయిన తన తండ్రి హత్యకు గురైతే ఇంతవరకు దోషులను పట్టుకోలేదంటే.. ఇక‌ సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలా మంది త‌న‌కు స‌ల‌హా ఇచ్చార‌న్నారు. అయితే.. త‌న మ‌న‌సు మాత్రం న్యాయం కోసం పోరాడమ‌ని చెబుతోంద‌న్నారు. న్యాయం కోసం ఇంకెంత కాలం ఎదురుచూడాల‌ని ప్ర‌శ్నించారు.

ఇది రాజకీయ హత్యే అయ్యుంటుందని, తనకు తెలిసినంత వరకు తన తండ్రికి శత్రువులు లేరన్నారు. ఆర్థికపరమైన వివాదాలు కూడా ఏమీ లేవని తెలిపారు. కేసు విచారణ గురించి ఓ అధికారిని అడిగితే.. కడప, కర్నూలు ప్రాంతాల్లో ఇలాంటివి సహజం అన్న సమాధానం వినిపించిందని, దాంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని సునీతారెడ్డి వివరించారు. 60 ఏళ్ల వయసున్న ఒంటరి వ్యక్తిని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ కేసులో న్యాయం కోసం ఇంకా ఎంత కాలం వేచిచూడాలో అర్థం కావడంలేదన్నారు. సాక్షులు ధైర్యంగా ముందుకొచ్చి కేసు విచారణలో సాయపడాలని విజ్ఞప్తి చేశారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story