అవినాశ్‌రెడ్డి గెలవకుండా చేయడమే నా ప్రయత్నం: సునీత
ఏపీలో ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో వివేకా హత్య కేసు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 6 April 2024 1:29 PM ISTఅవినాశ్‌రెడ్డి గెలవకుండా చేయడమే నా ప్రయత్నం: సునీత
వైఎస్ వివేకా హత్య కేసు గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఏపీలో ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో వివేకా హత్య కేసు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. వివేకాను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతున్నారనీ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆయన కూమార్తె సునీత ఆవేదన చెందారు. వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని అన్నారు. హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరుగదు అన్నారు. ఐదేళ్ల నుంచి వివేకా మర్డర్‌లో దోషులకు శిక్ష పడాలని పోరాడుతున్నాననీ.. ఈ పోరాటంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అర్థమైందని సునీత అన్నారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అవినాశ్ రెడ్డిని గెలవకుండా చేయడమే తన ప్రయత్నమని వివేకా కుమార్తె సునీత అన్నారు. తన పోరాటం రాజకీయం కోసం కాదనీ.. న్యాయం కోసమని స్పష్టంగా చెప్పారు. వైఎస్సార్ చనిపోయిన సమయంలో జగన్ ఎంపీగా ఉన్నారనీ.. పులివెందులలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై చర్చ జరిగింది. వైఎస్ భాస్కర్‌రెడ్డి పేరు ప్రతిపాదనకు రాగా.. దానికి వివేకా అంగీకరించలేదు. షర్మిల, విజయమ్మలో ఒకరిని పోటీలో దించాలని వివేకా చెప్పారని గుర్తు చేశారు. వివేకాకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయిస్తే.. జగన్ దీన్ని వ్యతిరేకించినట్లు చెప్పారు.
సీఎం జగన్ అసెంబ్లీలో అవినాశ్‌రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారని సునీత అన్నారు. కర్నూలులో అవినాశ్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయకుండా రెండ్రోజుల పాటు డ్రామా చేశారనీ.. ఇదంతా ప్రజలు గమనించారని వివేకా కుమార్తె సునీత చెప్పారు. వివేకా మర్డర్ కేసులో నిందితులకు శిక్ష కోసం పోరాడం చేయాలంటే ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందని చెప్పారు. సామాన్యులు కూడా న్యాయం సాధించగలరని నిరూపించేందుకే ఈ పోరాటం చేస్తున్నట్లు వివేకా కుమార్తె సునీత చెప్పారు. దశాబ్దాల తరబడి కేసులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. అధికారం లేకపోతే ఇలాంటి వారికి కొంత బలం తగ్గుతుందని సునీత చెప్పారు.