వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నని ఆమె స్వయంగా చెప్పారు. వైఎస్సార్ 73వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద్దకాకాని వద్ద పీన్లరీ సమావేశాలను ఏర్పాటు చేశారు. పీన్లరీ సమావేశాలకు హాజరైన వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి అందరివాడని, మీ అందరి హృదయాల్లో సజీవంగా ఉన్నారని అన్నారు.
వైసీపీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చెప్పారు. తన కొడుకు జగన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను పార్టీకి అండగా ఉన్నానని తెలిపారు. 'వైఎస్ జగన మాస్ లీడర్. జగన్ యువతకు రోల్‌మోడల్. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన మీ అందరిపైనా కృతజ్ఞత ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి 'అంటూ వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు.
తన కూతురు షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ పెట్టుకుందని, తన తండ్రి వైఎస్ ఆశయాలను సాధించేందుకు పోరాటం చేస్తోందని చెప్పారు. షర్మిలకు అండగా ఉండేందుకు తాను తెలంగాణలో ఉంటానని అన్నారు. ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు తన అండ అవసరమన్నారు. తన ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ చెప్పారు.