నవ సందేహాలకు సమాధానాలేవి..? సీఎం జగన్‌కు షర్మిల లేఖ

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  1 May 2024 5:43 AM GMT
ys sharmila, letter,  cm jagan, andhra pradesh,

నవ సందేహాలకు సమాధానాలేవి..? సీఎం జగన్‌కు షర్మిల లేఖ

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ వైసీపీ, సొంత అన్న సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి పార్టీలతో పాటుగా షర్మిల కూడా వైసీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా పలు సందేహాలను లెవనెత్తుతూ వాటికి సమాధానాలేవి అంటూ సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ లేఖలో షర్మిల పేర్కొన్నారు.

లేఖలో వైఎస్ షర్మిల లేవనెత్తిన సందేహాలు:

1. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్) నిధులను మీ ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లించడం నిజం కాదా?

2. భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సాగు కోసం భూమినిచ్చే కార్యక్రమాన్ని ఉన్నటుండి మీ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసింది?

3. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారి ప్రయోజనాల కోసం అమలవుతున్న వివిధ (28) పథకాలు/కార్యక్రమాలను అర్ధాంతరంగా మీరు ఎందుకు నిలిపివేశారు?

4. వెట్టి, జోగిని వ్యవస్థ వంటి సమాజిక రుగ్మతలను రూపుమాపడానికి ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?

5. విదేశీ విద్యను అభ్యసించ కోరే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయం కోసం చేపట్టిన పథకానికి అంబేద్కర్ పేరును తొలగించింది వాస్తమేనా? ఎందుకు తొలగించారు? తోలగించి ఎవరి పేరు, ఎందుకు పెట్టారు?

6. మీ పార్టీ ఎస్సీ, ఎస్టీ సిటింగ్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మందికి ఈ ఎన్నికల్లో ఎందుకు మీరు టిక్కెట్లు నిరాకరించారు? ఇది వివక్ష కాదా?

7. ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, ఇతర దాడులు, హింస తదితర క్రైమ్ రేటు 2021లో అసాధారణంగా పెరిగినట్టు మీ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన సమాచారంలో గణాంకలతో పాటు ఉన్న మాట నిజం కాదా?

8. దళిత డ్రైవర్ ను దారుణంగా హతమార్చి, మృతదేహాన్ని వారింటికి డోర్ డెలివరీ చేసిన కేసులో మీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న నిందితుడిని ఎందుకు సమర్ధిస్తూ వస్తున్నారు?

9. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడంలో ఎస్సీ, ఎస్టీ యువతకు ఎంతో దన్నుగా ఉంటూ ప్రభావవంతంగా పనిచేస్తున్న స్టడీసర్కిల్స్ ని, నిధులివ్వక మీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం నిజం కాదా?

తన సందేహాలకు సరైన సమాధానాలు, సమగ్ర వివరాలను ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేసింది. న్యాయ నవ సందేహాలను తీర్చిన తర్వాతే ఏపీలోని ఎస్సీలు, ఎస్టీల ఓట్లను అడగాలంటూ షర్మిల డిమాండ్ చేసింది. అప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలను ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎం జగన్‌కు, వైసీపీ నాయకులకు లేదని ఆమె లేఖలో పేర్కొన్నారు.

Next Story