వైఎస్సార్ పాలనతో జగన్ పాలనకు పొంతనే లేదు: షర్మిల
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనతో.. జగన్ పాలనకు పొంతనే లేదని వైఎస్ షర్మిల అన్నారు.
By Srikanth Gundamalla Published on 8 April 2024 2:30 PM ISTవైఎస్సార్ పాలనతో జగన్ పాలనకు పొంతనే లేదు: షర్మిల
ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచారంలో పాల్గొంటున్నారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా మైదకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సీఎం జగన్ వారసుడే కాదనీ షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనతో.. జగన్ పాలనకు పొంతనే లేదని వైఎస్ షర్మిల అన్నారు.
వైఎస్సార్ పాలనను, జగన్ పాలనను భూతద్దం పెట్టి చూసినా ఒక్క పోలిక కనిపించదని వైఎస్ షర్మిల అన్నారు. సీఎం జగన్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్‌రెడ్డికి మద్దతుగా ఉన్నారని చెప్పారు. సీబీఐ అధికారులే వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి నిందితుడని చెప్పినట్లు గుర్తు చేశారు. కాల్ రికార్డులు, గూగుల్ మ్యాప్స్, లావాదేవీలు ఉన్నట్లు పేర్కొందని వైఎస్ షర్మిల అన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా కూడా వైఎస్ జగన్.. అవినాశ్‌రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. హంతకులు.. వారిని కాపాడుతున్న వారికి ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని ప్రజలకు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
వైసీపీ పాలనలో ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ హయాంలో రైతు రారాజుగా ఉంటే.. ఇప్పుడు అప్పులేని రైతే లేడని అన్నారు. రైతులతో పాటు సామాన్య ప్రజలు కూడా వైఎస్ జగన్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. ఏకంగా ప్రభుత్వమే మద్యాన్ని విక్రయిస్తుందని మండిపడ్డారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలను తీస్తూ.. వారి ఉసురు పోసుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి.. మెగా డీఎస్సీ హామీ ఇచ్చి.. నాలుగున్నరేళ్లు నిద్రపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు 6వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. సీఎం జగన్ హత్యారాజకీయాలు చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచన చేయాలనీ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.